July 23, 2026

Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!

Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
Reading Time: < 1 minute
Thalapathy Vijay Jana Nayagan Technician Producer Story

Venkat K Narayana: తమిళనాడు సీఎం, స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ప్రతిష్టాత్మక పొలిటికల్, యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జననాయగన్ (తెలుగులో జన నాయకుడు). విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించి, సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నో సెన్సార్ వివాదాలు, అడ్డంకులను అధిగమించి ఈ చిత్రం జూలై 23, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సినిమానే ఆయన చివరి సినిమాగా ప్రచారం అవుతుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిర్మాత వెంకట్ కె.నారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాణ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. ఒక సందర్భంలో దళపతి విజయ్ తనకు ఫోన్ చేసి జన నాయగన్ సినిమా కోసం పనిచేస్తున్న ఓ టెక్నీషియన్‌ను మార్చాలని సూచించారన్నారు. అయితే వెంటనే మరో ప్రశ్న కూడా అడిగారని వెల్లడించారు. “ఆ టెక్నీషియన్‌ను మార్చితే మీకు (నిర్మాతకు) ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉంటుందా?” అని విజయ్ అడిగారని తెలిపారు. దీనికి తాను “అవును సర్.. కొంత ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఉంటుంది. అయినా నేను మేనేజ్ చేస్తాను” అని సమాధానం ఇచ్చానన్నారు. అయితే నా సమాధానం విన్న వెంటనే విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని వెంకట్ కె. నారాయణ వెల్లడించారు. నిర్మాతపై అదనపు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ఆ టెక్నీషియన్‌ను మార్చకుండా కొనసాగించాలని నిర్ణయించారని చెప్పారు. ఈ ఘటన విజయ్ నిర్మాతల పట్ల ఎంత గౌరవం, బాధ్యతతో వ్యవహరిస్తారో చెప్పే ఉదాహరణ అని వెంకట్ కె. నారాయణ వ్యాఖ్యానించారు. సినిమా నిర్మాణంలో నిర్మాత పెట్టే పెట్టుబడి, ఎదుర్కొనే రిస్క్‌ను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే హీరోలు చాలా అరుదుగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.