16 ఏళ్ల తర్వాత భారత్‌కు వస్తున్న లలిత్ మోడీ.. ఐపీఎల్ మాజీ బాస్ రీఎంట్రీపై జోరుగా చర్చ!

Lalit Modi: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (IPL) సృష్టికర్త, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత తిరిగి భారతదేశానికి రావడానికి సిద్ధమవుతున్నారు. 2010లో దేశం విడిచి వెళ్లిన ఆయన, ఇన్నాళ్లూ విదేశాల్లో నివసిస్తూ అనేక లీగల్ విచారణలను ఎదుర్కొన్నారు. తాజాగా 2009 ఐపీఎల్ సౌతాఫ్రికా ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో, తిరిగి స్వదేశంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది.
FEMA కేసులో బిగ్ రిలీఫ్:
స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (SAFEMA) అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ కేసులో లలిత్ మోడీకి, బీసీసీఐకి భారీ ఊరటనిచ్చింది. 2009లో సాధారణ ఎన్నికల భద్రతా కారణాలతో ఐపీఎల్ టోర్నీని సౌతాఫ్రికాకు తరలించినప్పుడు, విదేశీ మారక ద్రవ్య నిబంధనలను ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన ఆరోపణలను ట్రిబ్యునల్ రద్దు చేసింది. లలిత్ మోడీపై వ్యక్తిగతంగా నిబంధనల ఉల్లంఘన మోపడానికి తగిన ఆధారాలు లేవని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది.
నిజం గెలిచింది.. నా ప్రాణం ఐపీఎల్:
ఈ తీర్పుపై లలిత్ మోడీ తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. 16 ఏళ్లుగా తాను మీడియాకు, ప్రజలకు చెబుతున్న మాటలే ఈరోజు నిజమని రుజువయ్యాయని పేర్కొన్నారు. గత 16 ఏళ్లుగా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను.. ఈరోజు నా నిజాయితీ గెలిచింది.. నాకు ఎప్పుడూ ఐపీఎల్ శ్రేయస్సు తప్ప మరొక ఆలోచన లేదు.. ఇప్పుడు ఆ పాత అధ్యాయం ముగిసింది, నేను జీవితంలో ముందుకు కొనసాగాలని అనుకుంటున్నాను.. అక్టోబర్‌లో నా కుమార్తెకు మనవడు పుట్టబోతున్నాడు. అంతా బాగా జరిగితే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో నేను భారతదేశానికి తిరిగి వస్తాను అని వెల్లడించాడు.
ఎవరీ లలిత్ మోడీ? ఐపీఎల్ సృష్టి నుండి నిషేధం వరకు:
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ధనిక క్రికెట్ లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ (IPL) ను డిజైన్ చేసి, దాన్ని ప్రారంభించడంలో లలిత్ మోడీ ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే అతడి హయాంలో ఫ్రాంచైజీల వేలం, ప్రసార హక్కుల కేటాయింపు, ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), 2013లో ఆయనపై తీవ్ర క్రమశిక్షణా చర్యలు తీసుకుని క్రికెట్ పరిపాలన నుంచి జీవితకాల నిషేధం విధించింది.
#WATCH | IPL founder and first chairman Lalit Modi to return to India.
He says, “I’m really happy with the verdict yesterday. It’s really been a great day. 16 years I have fought and whatever I have been saying to the media and to everybody has finally emerged as the truth. I’m… pic.twitter.com/QTN7VkzuEy
— ANI (@ANI) July 22, 2026