Reading Time: 2 minutes
Manav Suthar Creates History On Test Debut Breaks Amit Mishras Record Vs Afghanistan

Manav Suthar Scripts History on Test Debut: ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. తన అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే 6 వికెట్లు పడగొట్టి భారత క్రికెట్‌లో అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ శతాబ్దంలో భారత తరఫున టెస్ట్ అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మానవ్ నిలిచాడు. 2008లో ఆస్ట్రేలియాపై అమిత్ మిశ్రా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో 5/71 గణాంకాలు నమోదు చేశాడు. ఇప్పుడు మానవ్ 6/33తో అమిత్ అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు.

అయితే భారత టెస్ట్ చరిత్రలో అరంగేట్ర ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన జాబితాలో మాత్రం మానవ్ సుతార్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మాజీ స్పిన్నర్ నరేంద్ర హిర్వానీ అగ్ర స్థానంలో ఉన్నాడు. 1988లో చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో హిర్వానీ (8/61) vs బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. 1967లో ఆస్ట్రేలియాపై అబిద్ అలీ (6/55), 1979లో ఆస్ట్రేలియాపై దిలీప్ దోషి (6/103)లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న మానవ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు.

అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. యువ స్పిన్నర్ ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక చేతులెత్తేశారు. 22 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 10 మెయిడెన్లు వేసి.. కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి, 6 వికెట్లు పడగొట్టాడు. 1.50 ఎకానమీతో బౌలింగ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తర్వాత భారత జట్టుకు మరో నాణ్యమైన స్పిన్నర్ దొరికాడని నెటిజెన్స్, ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఒత్తిడిని తట్టుకుని 6 వికెట్లతో మెరిసిన మానవ్.. భవిష్యత్తులో భారత స్పిన్ దళానికి కీలక బలంగా మారే అవకాశాలు ఉన్నాయి.

డెబ్యూ టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు:
నరేంద్ర హిర్వానీ – 8/61 vs వెస్టిండీస్ (చెన్నై, 1988)
మానవ్ సుతార్ – 6/33 vs అఫ్గానిస్థాన్ (ముల్లాన్‌పూర్, 2026)
అబిద్ అలీ – 6/55 vs ఆస్ట్రేలియా (అడిలైడ్, 1967)
దిలీప్ దోషి – 6/103 vs ఆస్ట్రేలియా (చెన్నై, 1979)