Reading Time: < 1 minute
Mother In Law And Son In Law Claim Court Marriage Viral Video Sparks Debate In Uttar Pradesh

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ అసాధారణ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఓ అల్లుడు తనకు పిల్లనిచ్చిన అత్త అందానికి ముగ్ధుడై ప్రేమలో పడ్డాడు. చివరకు ఆమెనే పెళ్లాడాడు. కూతురి పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించిన అల్లుడు.. అత్తతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉన్నప్పటికీ.. లోకం ఏమనుకున్నా పర్వాలేదంటూ ఇళ్లనుంచి పారిపోయి మరీ కోర్టులో వివాహం చేసుకున్నారు.

అనంతరం తాము ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నామంటూ కోర్టు సర్టిఫికేట్ తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. వివాహం అనంతరం సోషల్ మీడియాలో విడుదలైన వీడియోలో వారు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ, తమ బంధాన్ని గౌరవించాలని, ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.

స్థానికంగా చర్చనీయాంశం

ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా విస్తృత చర్చ జరుగుతోంది. మహిళ, ఆమె అల్లుడు చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నారని కొందరు స్థానికులు పేర్కొంటున్నప్పటికీ, ఈ వాదనలకు సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వ్యవహారం కుటుంబ సభ్యులను, బంధువులను ఆశ్చర్యానికి గురి చేసింది. సంప్రదాయ కుటుంబ విలువలు, సామాజిక సంబంధాల నేపథ్యంలో ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు

ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికల్లో విభిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు దీనిని వ్యక్తిగత నిర్ణయంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు సామాజిక, కుటుంబ పరమైన కోణాల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వైరల్ వీడియో కారణంగా ఈ విషయం స్థానిక స్థాయిని దాటి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.