Reading Time: < 1 minute
Upi Safety Tips Common Mistakes That Can Empty Your Bank Account In Seconds

UPI Safety: యూపీఐ చెల్లింపులు భారతదేశంలో రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దాదాపు ప్రతి చోటా ఫోన్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌ల వల్ల నగదు అవసరం చాలా వరకు తగ్గిపోయింది. అయితే యూపీఐ వినియోగం పెరిగిన కొద్దీ సైబర్ నేరగాళ్ల మోసాలు కూడా పెరుగుతున్నాయి. కేవలం కొన్ని సెకన్ల నిర్లక్ష్యం వల్లే బ్యాంక్ ఖాతాలోని డబ్బు కోల్పోయిన సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి.

చాలామంది డబ్బు అందుకోవడానికి వచ్చిన రిక్వెస్ట్‌ను పొరపాటున ఆక్సెప్ట్ చేస్తుంటారు. నిజానికి యూపీఐలో డబ్బు తీసుకునేవనేందుకు ఎలాంటి పిన్ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. పిన్ అడిగితే అది డబ్బు పంపే ప్రక్రియలో భాగమని గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై అవగాహన లేకపోవడంతో కొందరు మోసగాళ్ల వలలో పడుతున్నారు. అలాగే క్యాష్‌బ్యాక్, బహుమతులు, లాటరీలు వచ్చాయని చెప్పే నకిలీ లింక్‌లను క్లిక్ చేయడం కూడా ప్రమాదకరమే.

ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. బ్యాంక్ ఉద్యోగులమని చెప్పినా, కస్టమర్ కేర్ పేరుతో ఫోన్ చేసినా ఈ వివరాలను ఇవ్వకూడదు. చాలామంది సమస్య పరిష్కారం కోసం స్క్రీన్ షేరింగ్ యాప్‌లను కూడా ఇన్‌స్టాల్ చేస్తుంటారు. దీని ద్వారా మోసగాళ్లు ఫోన్‌పై నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది.

డిజిటల్ లావాదేవీలు సౌకర్యవంతమైనవే అయినా భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. తెలియని లింక్‌లను ఓపెన్ చేయకపోవడం, యాప్‌లను అధికారిక స్టోర్ల నుంచే డౌన్‌లోడ్ చేసుకోవడం, అనుమానాస్పద కాల్స్‌ను నమ్మకపోవడం వంటి చిన్న జాగ్రత్తలు పెద్ద నష్టాలను నివారించగలవు. యూపీఐ ఎంత వేగంగా డబ్బు పంపుతుందో, అంతే వేగంగా మోసాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి.