Reading Time: 2 minutes
Jason Holder Reacts To Rajat Patidar Controversial Catch Ipl 2026 Gt Vs Rcb Drama

Jason Holder Reacts to Rajat Patidar Controversial Catch: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేశాడు. అహ్మదాబాద్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌తో జట్టుకు కీలక విజయం అందించిన హోల్డర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా కూడా ఈ మ్యాచ్ చాలా సంతృప్తినిచ్చిందని, జట్టుగా కూడా అద్భుతంగా ఆడామని చెప్పాడు. మొదటి నుంచే జట్టులో ఎనర్జీ ఉందని, అదే విజయంలో కీలక పాత్ర పోషించిందని తెలిపాడు. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందిస్తూ.. క్యాచ్ సమయంలో కగిసో రబాడ (కేజీ) తన దగ్గరే ఉన్నాడని, అతడిని ఢీకొట్టకుండా జాగ్రత్త పడాల్సి వచ్చిందని చెప్పాడు.

‘క్యాచ్ సమయంలో నా దృష్టి మొత్తం బంతిపైనే ఉంది. కేజీ కూడా నాకు సమీపంలోనే ఉన్నాడు. నేలపై పడకుండా క్యాచ్ పట్టాలని మాత్రమే అనుకున్నా. చివరకు క్యాచ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం సంతోషంగా ఉంది’ అని జాసన్ హోల్డర్ వివరించాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్‌ ఔటైన తీరుపై వివాదం చెలరేగింది. క్యాచ్‌ను అందుకునే క్రమంలో హోల్డర్‌ కింద పడగా.. బంతిని కింద ఆనించినట్లు అనిపించింది. కానీ థర్డ్ అంపైర్‌ మాత్రం పాటీదార్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డగౌట్లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంపైర్లతో వాగ్వాదంకు దిగాడు.

ఈ మ్యాచ్‌లో బంతి తన వైపే ఎక్కువగా వచ్చిందని జాసన్ హోల్డర్ సరదాగా అన్నాడు. ‘ఇలాంటి సందర్భాలు నేను ప్రత్యేకంగా కోరుకోను. కానీ వచ్చిన అవకాశాలను వదులుకోకుండా అందిపుచ్చుకోవడం ముఖ్యం. ఈ రోజు అలా జరిగింది. ఆ క్యాచ్ జట్టుకు ఉపయోగపడినందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. మిడిల్ ఆర్డర్‌లో తన పాత్రపై కూడా హోల్డర్ స్పందించాడు. జట్టు మేనేజ్‌మెంట్ చాలా ప్లాన్ ప్రకారం పనిచేస్తోందని, ముఖ్యంగా కోచ్ ఆశిష్ నెహ్రా ప్రణాళికలు ఎంతో స్పష్టంగా ఉంటాయని తెలిపాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా రెడీగా ఉండాలని, అవసరమైనప్పుడు జట్టును ఆదుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ, జట్టుకు విజయాలు అందించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని హోల్డర్ స్పష్టం చేశాడు.

పవర్‌ప్లేలో కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను జాసన్ హోల్డర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఇద్దరు తొలి ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపుకు తిప్పారని అన్నాడు. ఆ సమయంలో బ్యాటర్లు కొంత ఒత్తిడిలో ఉన్నారని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ మోమెంటమ్‌ను మార్చారని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచులో మొదట ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్‌ 15.5 ఓవర్లలో ఛేదించింది.