Reading Time: < 1 minute
Iran Reopens Airspace Hormuz Strait Internet Blackout Update

Iran Vs USA: సుమారు ఏడు వారాల సుదీర్ఘ విరామం తర్వాత ఇరాన్ తన గగనతలాన్ని పాక్షికంగా పునఃప్రారంభించింది. తూర్పు ఇరాన్ మీదుగా అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లు ఆ దేశ పౌర విమానయాన సంస్థ తాజాగా ప్రకటించింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి కొన్ని విమానాశ్రయాలను కూడా తెరిచారు. ఇరాన్ తన గగనతలాన్ని తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు మాత్రం అటువైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ల డేటా ప్రకారం.. ఇరాన్ మీదుగా చెప్పుకోదగిన స్థాయిలో విమానాల రాకపోకలు కనిపించడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఏయిర్ లైన్స్ సంస్థలు ఇప్పటికీ సుదీర్ఘమైన ప్రత్యామ్నాయ మార్గాలనే ఎంచుకుంటున్నాయి.

READ ALSO: Punarvika: పునర్వికకు పునర్జన్మ.. నేడే మంత్రి లోకేష్ సమక్షంలో రూ. 16 కోట్ల ఇంజెక్షన్..

హోర్ముజ్ జలసంధిపై ఉత్కంఠ..
మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలని బ్రిటన్ విదేశాంగ మంత్రి యెవెట్ కూపర్ పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ జరిగినప్పటికీ, ఈ మార్గంలో ఇంకా అస్థిరత కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇరాన్ మాత్రం హోర్ముజ్ జలసంధిపై తన పట్టును సడలించడం లేదు. కొన్ని షరతులకు లోబడి మాత్రమే ఈ మార్గాన్ని తెరిచామని, శత్రు దేశాల సైనిక నౌకలకు అనుమతి లేదని ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదే సమయంలో అమెరికాతో మరో విడత శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తెగేసి చెప్పింది. పాకిస్థానీ మధ్యవర్తి ద్వారా ఈ నిర్ణయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. దీనివల్ల మధ్యప్రాచ్యంలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇరాన్ ప్రజలు గత 50 రోజులుగా ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. నెట్‌బ్లాక్స్ నివేదిక ప్రకారం.. దేశంలో దాదాపు ఏడు వారాలుగా డిజిటల్ బ్లాక్‌అవుట్ అమల్లో ఉంది. ఇంటర్నెట్ నిలిపివేసి 1,176 గంటలు దాటిపోవడంతో వ్యాపారాలు, సమాచార మార్పిడి, ప్రజల దైనందిన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది.

READ ALSO: Nursing College Marriage Ban: పెళ్లి చేసుకుంటే అడ్మిషన్ క్యాన్సిల్.. నర్సింగ్ విద్యార్థినులకు కాలేజీ వింత కండిషన్! అసలు కథ ఇదే..