Reading Time: < 1 minute

‘శూర్ వీర్’ పాట వినిపిస్తూ సర్జరీ 

Caption of Image.
  • ఛత్రపతి శివాజీ ఫొటోకు నెత్తుటి తిలకం దిద్దబోయి చేయి కోసుకున్న యువకుడు
  • పనిచేయని రెండు వేళ్లు
  • అదే పాట వినిపిస్తూ ఆపరేషన్ చేసిన డాక్టర్లు 

ఎల్బీ నగర్, వెలుగు:  శివాజీ చిత్రపటానికి నెత్తుటి తిలకం దిద్దుదామనుకుని ఓ యువకుడు చేతికి గాటు పెట్టుకోవడంతో పొరపాటున చేతి వేళ్ల నరాలు అరచేతి వరకూ తెగిపోయాయి. దీంతో యువకుడిని వెంటనే ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్​కు తరలించడంతో డాక్టర్లు సకాలంలో ట్రీట్మెంట్ చేశారు. ఈ నెల 14న జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను ప్లాస్టిక్ అండ్ రీకన్ స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ బి. కృష్ణ చైతన్య తాజాగా మీడియాకు వెల్లడించారు.  ఎల్బీ నగర్ కు చెందిన ఓ యువకుడు(26) కొన్నేండ్లుగా వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూళ్లలో కరాటే ట్రైనర్ గా పని చేస్తున్నాడు. ఈ నెల14న సాయంత్రం ఓ స్కూల్లో విద్యార్థుల ముందు కల్చరల్ ఈవెంట్లో భాగంగా ప్రదర్శన ఇచ్చాడు.

‘శూర్ వీర్’ అనే పాట ప్లే అవుతుండగా.. శివాజీ చిత్రపటానికి తిలకం దిద్దే ఉద్వేగభరిత సన్నివేశం పండించాలనుకున్నాడు. ఇందుకోసం కత్తితో చేతికి చిన్న గాటు పెట్టుకుని నెత్తుటి తిలకం దిద్దాలనుకున్నాడు. కానీ కత్తి చాలా పదునుగా ఉండడంతో కుడిచేతి చిటికెన వేలు కింది భాగంలో లోతుగా సగం అరచేతి వరకు కట్ అయ్యింది. చిటికెన వేలు, పక్కన వేలుకు వెళ్లే నరాలు, రక్తనాళాలు తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో చేతివేళ్లు స్పర్ష కోల్పోయి పనిచేయలేదు.

దీంతో అతడిని కామినేనికి తరలించారు. డాక్టర్లు వెంటనే అతడిని ఆపరేషన్ థియేటర్ కు తరలించి సర్జరీ చేశారు. అయితే, అతడు ఈవెంట్ వేదికపై ఏ పాటకు ప్రదర్శన ఇస్తూ భావోద్వేగానికి గురయ్యాడో అడిగి తెలుసుకున్న డాక్టర్లు.. మళ్లీ అదే పాటను అతడికి వినిపిస్తూ సర్జరీ చేశారు. ఆపరేషన్ విజయవంతం అయిందని, సకాలంలో హాస్పిటల్​కు రావడం వల్ల అతడు చేతి వేళ్లు కోల్పోకుండా కాపాడగలిగామని డాక్టర్లు తెలిపారు.  

©️ VIL Media Pvt Ltd.