
- రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
- ప్రధాని కొత్త ఆఫీసులో కేబినెట్ తొలి సమావేశం
- జ్యూట్ మద్దతు ధర క్వింటాల్ రూ.5,925కు పెంపు
- రూ. 9,072 కోట్లతో 3 మెగా రైల్వే ప్రాజెక్టులకు పచ్చజెండా
- అహ్మదాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు గ్రీన్ సిగ్నల్
- విద్యుత్ రంగంలో సంస్కరణలకు ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నూతన కార్యాలయ సముదాయం (పీఎంవో) ‘సేవా తీర్థ్’లో జరిగిన తొలి సమావేశంలో కేంద్ర కేబినెట్ చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ నుంచి నిర్వహిస్తున్న పాలన అంతా దేశంలోని చిట్టచివరి వ్యక్తి జీవితాన్ని సులభతరం చేసే లక్ష్యంతోనే సాగుతుందని తీర్మానించింది. ఈ ప్రాంగణంలో ‘నాగరిక్ దేవో భవ’ (పౌరుడే దేవుడు) అనే ప్రేరణతో నిర్ణయాలు తీసుకుంటామని, ఇది ప్రతి భారతీయుడి సాధికారతకు కేంద్రంగా మారుతుందని ప్రకటించింది.
ఇది కేవలం ఒక భవనం కాదు..నవ భారత్ పునర్నిర్మాణానికి ప్రత్యక్ష నిదర్శనం అని తెలిపింది. సేవా తీర్థ్‌లో పని సంస్కృతి రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నది. ఇది ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’గా భారత్ గర్వాన్ని పెంచుతుందని తీర్మానం పేర్కొన్నది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
కేరళ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
కేరళ పేరును అధికారికంగా ‘కేరళం’గా మారుస్తూ ఆ రాష్ట్ర అసెంబ్లీ పంపిన తీర్మానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రం పేరును మార్చాలని కోరుతూ కేరళ సీఎం పినరయి విజయన్ 2024 జూన్ 24న అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ‘కేరళ’ అని ఉందని, దానిని ఆర్టికల్ 3 ప్రకారం ‘కేరళం’గా సవరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న అన్ని భాషల్లోనూ ఈ మార్పును వర్తింపజేయాలని కోరారు.
దీంతో ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపుతామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తర్వాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు. ఏప్రిల్–-మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నది.
పవర్ గ్రిడ్ ఇన్వెస్ట్‌మెంట్7,500 కోట్లకు పెంపు
దేశంలో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ తన ఒక్కో అనుబంధ సంస్థలో చేసే ఈక్విటీ పెట్టుబడి పరిమితిని రూ.5 వేల కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘మహారత్న’ హోదా కలిగిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌కు ఇచ్చే అధికారాల బదలాయింపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడి పరిమితి పెంచినా కంపెనీ మొత్తం నెట్ వర్త్‌లో 15 శాతానికి మించకూడదనే ప్రస్తుత రూల్ మాత్రం యథాతథంగా కొనసాగించనున్నారు.