Reading Time: < 1 minute
Sonam Wangchuk Gives Government 24 Hours To Release Cjp Protesters Threatens Hunger Strike

Sonam Wangchuk: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్తు్న్న నేతల్ని, నిరసనకారుల్ని అరెస్ట్ చేశారు. మరోవైపు, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్‌లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను విమానంలోని పోలీసులు అరెస్ట్ చేసి, రహస్య ప్రాంతానికి తరలించారు. 2000 మందికి పైగా సీజేపీ, లెఫ్ట్ పార్టీల కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే, ఈ నిర్బంధంపై ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. అరెస్టైన సీజేపీ నేతల్ని 24 గంటల్లో విడుదల చేయకపోతే, తాను నిరాహార దీక్ష చేపడుతానని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అవసరమైనే పాదయాత్ర ద్వారా కూడా నిరసన తెలిపే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ వంటి పరిస్థితులు ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని అన్నారు. ఈ ఉద్యమానికి చాలా మంది నాయకత్వం వహించేందుకు ముందుకు రావడాన్ని చూసి సంతోషించానని, అయితే వారందర్ని అరెస్ట్ చేయడం చూసి ఆందోళనకు గురయ్యానని అన్నారు.