విదేశీ ప్రయాణాలు, ఖరీదైన బంగారం, డెస్టినేషన్ వెడ్డింగ్స్.. వీటిపై మోజు పెంచుకోవడం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించారా? ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులు అనవసర విదేశీ ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. అసలు ప్రధాని అలా ఎందుకు చెప్పారు? దీనివల్ల మన దేశానికి, సామాన్యులకు కలిగే ప్రయోజనాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
బంగారం దిగుమతులు – రూపాయిపై ఒత్తిడి: మన దేశంలో బంగారానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ మనం వాడే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇక దీనివల్ల దేశ విదేశీ మారకద్రవ్యం భారీగా బయటకు వెళ్ళిపోయి వాణిజ్య లోటు పెరుగుతుంది. తద్వారా భారత రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే అనవసర బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని సూచించారు.

దేశీయ టూరిజం – మన వాళ్లకే ఉపాధి: మనం విదేశీ పర్యటనలకు, విదేశాల్లో పెళ్లిళ్లకు పెట్టే ఖర్చు అంతా అక్కడెక్కడో ఉండే హోటళ్లు, రవాణా రంగాలకు చేరుతుంది. ఇక అదే ఖర్చును మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో లేదా ‘వెడ్ ఇన్ ఇండియా’ పేరుతో స్వదేశంలోనే పెళ్లిళ్లకు ఉపయోగిస్తే.. మన దేశీయ వ్యాపారాలు పుంజుకోవడమే కాకుండా స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది.
అంతర్జాతీయ ముప్పు – స్వదేశీ మంత్రం: మనం వాడే ముడి చమురులో 88 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. పశ్చిమాసియా యుద్ధాలు, ఇతర ప్రపంచ పరిణామాల వల్ల ఇంధన ధారలు ఎప్పుడైనా మారొచ్చు. ఇక ఇలాంటి సమయంలో విదేశీ వస్తువులు, సేవలపై ఆధారపడటం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది.
“మనం ఎంతగా స్వదేశీకి ప్రాధాన్యం ఇస్తే.. అంతగా స్వయంసమృద్ధి సాధిస్తాం” అన్నది ప్రధాని సందేశం. మనం రూపాయి ఖర్చు చేసేటప్పుడు మన దేశంలో తయారైన వస్తువులు, మన దేశీయ సేవలకే మొదటి ప్రాధాన్యం ఇస్తే, 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణం మరింత వేగవంతమవుతుంది.
గమనిక: ఇది విదేశీ ప్రయాణాలు లేదా కొనుగోళ్లను పూర్తిగా నిషేధించడం కాదు; దేశీయ రంగాన్ని, స్థానిక వ్యాపారాలను బలోపేతం చేయడం కోసం మోదీ అందించిన ఒక ప్రాధాన్యతా సూచన మాత్రమే.
The post విదేశీ టూర్లు, ఖరీదైన బంగారం, విదేశీ పెళ్లిళ్లు.. మోదీ ఎందుకు వద్దంటున్నారు? appeared first on Manalokam – Latest Telugu News & Updates.