July 23, 2026

Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..

Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
Reading Time: < 1 minute
Pawan Kalyan Red Sanders Smuggling Action

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన అటవీ సంపద అయిన ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. అమరావతిలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూటమి ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అవలంబిస్తోందని స్పష్టం చేశారు. ఈ మాఫియా మూలాలను పూర్తిగా తుడిచిపెట్టేలా క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవాలని, స్మగ్లింగ్ నిర్మూలనలో ఏమాత్రం ఉపేక్షించేది లేదని అధికారులను ఆదేశించారు.

సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా

అడవుల రక్షణ, స్మగ్లింగ్ అరికట్టే ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. డ్రోన్ పరిజ్ఞానం , ఇతర అత్యాధునిక సాంకేతికతను వినియోగించి నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. కేవలం నాటుగా చెట్లు నరికే కూలీలపైనే కాకుండా, ఈ స్మగ్లింగ్ ముఠాల వెనుక ఉండి నడిపిస్తున్న కింగ్‌పిన్‌లు, ఫైనాన్షియర్లపై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా రవాణా అయి దేశంలో ఎక్కడ దాచిన ఎర్రచందనం నిల్వలను వదలకుండా స్వాధీనం చేసుకోవాలని చెప్పారు.

అంతర్రాష్ట్ర సమన్వయం , సమష్టి కార్యాచరణ

మన ఎర్రచందన సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పునరుద్ఘాటించిన డిప్యూటీ సీఎం, ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖ అధికారులతో తక్షణమే సమన్వయం పెంచుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో దాచి ఉంచిన ఎర్రచందనం అక్రమ నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగంతో కలసి పనిచేయాలన్నారు. అంతర్రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి, ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖలు సమష్టిగా, బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.