Reading Time: < 1 minute
Hydra Ranganath Government Land Protection Bathukamma Kunta

HYDRA Ranganath: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రయోగం ‘హైడ్రా’ అని, దేశంలోనే ఎక్కడా ఈ తరహా వ్యవస్థ లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఎన్టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, గడిచిన రెండేళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్లను పంచుకున్నారు. మొదట్లో కూల్చివేతల సమయంలో ప్రజల కన్నీళ్లు, ఆక్రందనలు చూశామని, కొన్నిచోట్ల పేదలకు అన్యాయం కూడా జరిగిందని ఆయన అంగీకరించారు. అయితే, వైఫల్యాలు , ఇబ్బందుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగామని, అన్యాక్రాంతమైన విలువైన భూములను కాపాడినప్పుడు ప్రజల నుంచి విశేష ప్రశంసలు దక్కాయని పేర్కొన్నారు.

హైడ్రా తన రెండేళ్ల ప్రయాణంలో ఏకంగా రూ. లక్షా యాభై వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడిందని కమిషనర్ తెలిపారు. మొదటి సంవత్సరంలో రూ. 30 వేల కోట్లు, రెండో సంవత్సరంలో రూ. లక్షా 20 వేల కోట్ల విలువైన భూములను ఆక్రమణదారుల నుంచి రక్షించినట్లు వివరించారు. భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో మరొక రూ. లక్షన్నర కోట్ల విలువైన ఆస్తులను కాపాడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్పష్టత

ఆక్రమణల తొలగింపుకు ఉదాహరణగా ‘బతుకమ్మ కుంట’ను ఆయన ప్రస్తావించారు. ఒకప్పుడు ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ప్రాంతం గంజాయి వ్యాపారానికి, అసాంఘిక శక్తులకు నిలయంగా ఉండేదని తెలిపారు. అన్‌రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉందంటూ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అది చెరువు భూమి కాదని వాదించినప్పటికీ, చట్టపరంగా ముందడుగు వేసి ఆ ఐదెకరాల చెరువును తిరిగి పునరుద్ధరించినట్లు రంగనాథ్ వివరించారు. ప్రజల ఆస్తులను, చెరువులను కాపాడే దిశగా హైడ్రా తన పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.