July 23, 2026

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
Reading Time: < 1 minute
Chandrababu Naidu Meets Pm Modi Bhogapuram Airport Inauguration Invitation

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆగస్టు 1న ప్రతిష్టాత్మకంగా జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానిని ఆహ్వానించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.

ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ బృందం పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశమై రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన సీఎం, ఆక్వా రైతులు, రొయ్యల దాణా తయారీదారులు, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ రంగాల పురోగతికి అవసరమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, రైతులకు కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరారు.

జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో సమావేశమై సాగునీటి ప్రాజెక్టులు, జలవనరుల అభివృద్ధిపై చర్చలు జరిపారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర ప్రజల కలల ప్రాజెక్ట్ అయిన విశాఖపట్నం మెట్రో రైలు సత్వర అమలు, కేంద్ర ఆమోదం, నిధుల కేటాయింపుపై పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా చర్చించారు. ఖట్టర్‌కు కూడా ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికను అందజేశారు.

ఢిల్లీ పర్యటనలో జరిగిన ఈ కీలక భేటీలు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు, వ్యవసాయ అనుబంధ రంగాల పురోగతికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి ఎంతో దోహదపడతాయని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.