July 23, 2026

CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్

CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
Reading Time: 2 minutes
Jasprit Bumrah Wife Sanjana Ganesan Suryakumar Yadav Wife Devisha Shetty React Delhi Student Protests

దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. సోమవారం విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో విద్యార్థులకు మద్దతుగా సినీ, రాజకీయ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా టీమిండియా క్రికెటర్ల భార్యలు కూడా సోషల్ మీడియాలో కీలక పోస్ట్‌లు పెట్టారు. స్టార్ క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ భార్యలు చేసిన సోషల్ మీడియా పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. జంతర్‌మంతర్ దగ్గర శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై బుమ్రా భార్య సంజనా గణేశన్, సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

సంజనా గణేశన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోలీసుల చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన ప్రాంతానికి దూరంగా ఉన్న ఆరేళ్ల చిన్నారి కూడా టియర్ గ్యాస్ ప్రభావానికి గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ మానవతా కోణంలో స్పందించారు. ‘‘నిరసనలకు దూరంగా కూర్చున్న ఆరేళ్ల చిన్నారికే ఇలా జరిగితే… అది ఎవరికైనా జరగొచ్చు. ప్రజాస్వామ్యంలో పిల్లలు టియర్ గ్యాస్‌తో ఇబ్బంది పడటాన్ని సాధారణంగా చూడకూడదు. శాంతియుత పౌరులు తమను రక్షించాల్సిన భద్రతా సిబ్బందినే చూసి భయపడే పరిస్థితి ఉండకూడదు.’’ అంటూ పేర్కొన్నారు.

మరోవైపు దేవిషా శెట్టి మాత్రం చట్టం, శాంతిభద్రతల పరిరక్షణ అవసరాన్ని ప్రస్తావించారు. విద్యార్థుల పట్ల తనకు సానుభూతి ఉన్నప్పటికీ, హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని స్పష్టం చేశారు. ‘‘రాళ్లు విసరడం, పోలీసులపై దాడి చేయడం, బారికేడ్లు ధ్వంసం చేయడం, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం మొదలుపెట్టిన క్షణం నుంచి అది నిరసన కాదు… చట్టాన్ని ఉల్లంఘించినట్లే. హింస ప్రజాస్వామ్యం కాదు.’’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఇదిలా ఉండగా ఢిల్లీలో జరిగిన ఈ విద్యార్థుల ఆందోళనపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులపై పోలీసులు అనవసరంగా బలప్రయోగం చేశారని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తుండగా.. హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు అవసరమేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగానే కాకుండా సామాజికంగానూ చర్చనీయాంశంగా మారింది.

1

2