Reading Time: < 1 minute
Trisha Goddess Banner Sparks Controversy At Salem Temple Festival

CM Vijay and Trisha Controversy: తమిళనాడులోని సేలం జిల్లాలో మారియమ్మన్ ఆలయ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ ఫ్లెక్సీలో హీరోయిన్ త్రిషను అమ్మవారి అవతారంలో, తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్‌ను రావణాసురుడి రూపంలో చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు కారణమైంది.

పవిత్రమైన ఆలయ ఉత్సవాల్లో సినీ నటులు, సినిమాలకు సంబంధించిన చిత్రాలను ఉపయోగించడం ఏమాత్రం సమంజసం కాదంటూ స్థానిక ప్రజలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చ సాగుతోంది. పలువురు నెటిజన్లు ఇలాంటి ఫ్లెక్సీలు మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇక, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేశారు. కడైవీధికి చెందిన చంద్రు, తలైవాసల్ ప్రాంతానికి చెందిన గోకుల్‌లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన సేలం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.