July 23, 2026

Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..

Dharmendra Pradhan: నీట్‌పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
Reading Time: 2 minutes
Education Minister Dharmendra Pradhan Slams Congress Over Student Protests In Delhi

Dharmendra Pradhan: దేశ రాజధాని ఢిల్లీలో విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై కొనసాగుతున్న ఆందోళనలు రాజకీయంగా మరింత వేడెక్కాయి. కాంగ్రెస్ చేపట్టిన నిరసనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, విద్యార్థుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవద్దని కాంగ్రెస్‌కు సూచించారు. ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రధాని నివాసం ఎదుట కాంగ్రెస్ చేపట్టిన ధర్నా ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగించిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇలాంటి నిరసనలతో భద్రతా నిబంధనలు కూడా ఉల్లంఘించబడుతున్నాయని పేర్కొన్నారు. రాజకీయ ప్రచారం కోసం దేశ విద్యార్థులను అడ్డుపెట్టుకోవడం సమంజసం కాదని, వారి పట్ల అన్ని రాజకీయ పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇక, నీట్ పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీల అంశంపై సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

మరోవైపు, విద్యా సంస్కరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. జూలై 21న రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి నివాసం వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, విద్యా సంస్కరణల కోసం ఉద్యమం చేస్తున్న కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. జూలై 20న జనపథ్ మెట్రో స్టేషన్ పరిసరాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చగా, నిరసనకారులు మరియు ఢిల్లీ పోలీసులు మధ్య పలుమార్లు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు.. అనంతరం జంతర్ మంతర్‌లోని నిరసన శిబిరాలను తొలగించినప్పటికీ, నిరసనకారులు మళ్లీ అక్కడికి చేరుకుని తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు.