Reading Time: < 1 minute
Mohammed Siraj Joins Warangal Warriors For Rs 14 Lakh In Tg20 League Auction 2026

Mohammed Siraj Joins Warangal Warriors: తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జోరుగా కొనసాగుతోంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ నిర్వహిస్తున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు భారీ ధర పలికింది. వరంగల్ వారియర్స్ ఫ్రాంఛైజీ అతడిని రూ.14 లక్షలకు సొంతం చేసుకుంది. సిరాజ్ ఎంపికతో వరంగల్ జట్టు బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.

వరంగల్ వారియర్స్ వేలంలో దూకుడుగా వ్యవహరిస్తూ పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. రిషికేత్ సిసోదియాను రూ.4.75 లక్షలకు కొనుగోలు చేసిన ఈ ఫ్రాంఛైజీ.. హర్షిత్ చౌదరిని రూ.3 లక్షలకు దక్కించుకుంది. అలాగే భావేశ్‌ను రూ.5 లక్షలకు జట్టులోకి తీసుకుని తమ స్క్వాడ్‌ను మరింత పటిష్టం చేసుకుంది. మరోవైపు మహ్మద్ అబ్దుల్ మాలిక్‌ను కూడా రూ.3 లక్షలకు సొంతం చేసుకుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లపై వరంగల్ వారియర్స్ దృష్టి పెట్టింది.

ఎ ప్లస్ కేటగిరీలో ఉన్న అమన్ రావుకు వేలంలో మంచి ధర పలికింది. అతడిని వరంగల్ వారియర్స్ రూ.12 లక్షలకు కొనుగోలు చేసింది. దీంతో వరంగల్ జట్టు వేలంలో అత్యంత చురుకైన ఫ్రాంఛైజీలలో ఒకటిగా నిలిచింది. యువ ప్రతిభకు ప్రాధాన్యత ఇస్తున్న టీజీ20 లీగ్ వేలంలో ఇంకా పలువురు ఆటగాళ్లపై ఆసక్తికర పోటీ కొనసాగుతోంది. తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టీజీ20 లీగ్ జూన్ 20 నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. జూలై 11న ఫైనల్‌తో టోర్నీ ముగియనుండగా.. రాష్ట్ర యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే గొప్ప వేదికగా ఈ లీగ్ నిలవనుంది.