Reading Time: < 1 minute
Surendranath College Cash Gun Condoms Kolkata Row

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయాలు వేడెక్కతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(సంక్షోభం) దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే, మరో రాజకీయ దుమారం చెలరేగింది. కోల్‌కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాల ఒక పెద్ద వివాదానికి కేంద్రంగా నిలిచింది. కాలేజీలోని విద్యార్థి సంఘం గదిలో కోటి రూపాయల నగదు, రెండు ఏసీ బెడ్‌రూంలు, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్‌ దొరకడం సంచలనంగా మారింది. దీంతో బీజేపీ, టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసింది.

విద్యా్ర్థి సంఘం ఎన్నికలు జరగకపోవడం వల్ల కాలేజీలోని విద్యార్థి సంఘం హాళ్లను మూసేయాలని 2025లో కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఏడాది తర్వాత స్టూడెంట్ యూనియన్ గదిని తెరిచారు. దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై స్టూడెంట్ యూనియన్ గదిలో అత్యాచారం జరిగిన తర్వాత కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. అయితే, ఇటీవల బీజేపీ సర్కార్ కాలేజీ విద్యార్థి సంఘ నిధుల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశించింది. దీంతో కాలేజీ యాజమాన్యం మంగళవారం స్టూడెంట్ యూనియన్ గదిని శుభ్రపరిచే సమయంలో ఈ వస్తువులు వెలుగులోకి వచ్చాయి.

గదిలోని అల్మారాలో చెదలు పట్టిన స్థితిలో 100, 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ డబ్బు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీ అడ్మిషన్ల సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లతో ఈ డబ్బుకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ గదుల్లో ఏసీలు, అటాచ్డ్ టాయిలెట్స్, ఖరీదైన పరుపులు ఉన్నాయి. గతంలో తృణమూల్ సర్కార్ లోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ గదుల్ని ఉపయోగించేవారని కాలేజీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని పలు కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి.