Reading Time: < 1 minute

మే నెల వాతావరణం : రుతు పవనాల గుడ్ న్యూస్.. అంతలోనే ఎల్ నినో భయం.. బీభత్సమైన ఎండలు..!

Caption of Image.

భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్.. ఓ వైపు దడ పుట్టిస్తూనే.. మరో వైపు చల్లని కబురు చెబుతోంది. అంతలోనే భయాన్ని తెప్పిస్తుంది. అవును.. 2026, మే నెల.. ఈ మే నెల 31 రోజులు విభిన్నంగా ఉండనున్నట్లు చెబుతోంది వాతావరణ శాఖ. 

మే నెలలో ఎండలు బీభత్సంగా ఉంటాయని.. సాధారణం కంటే అధికంగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని స్పష్టం చేసింది. హిమాలయ పర్వత ప్రాంతాలు, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతూ.. వడగాలుల బీభత్సం ఉంటుందని హెచ్చరించింది. అంతే కాదు.. రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. దక్షణాది రాష్ట్రాల్లో మండే ఎండలతోపాటు.. రాత్రి పూట సైతం వేడి గాలులు ఉంటాయని.. ఉక్కబోత తప్పదని స్పష్టం చేస్తోంది వెదర్ రిపోర్ట్.

మే నెలలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో వర్షం పడుతుందని సూచించింది. 

మరో శుభవార్త ఏంటంటే.. ఈ నెల 14 నుంచి 16వ తేదీ మధ్య.. అంటే మరో 15 రోజుల్లో అండమాన్ నికోబర్ దీవులకు నైరుతి రుతు పవనాలు వస్తాయని అంచనా వేస్తోంది. రెండు, మూడు రోజులు అటూ ఇటూగా నైరుతి రావొచ్చని అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. 

ఇదే సమయంలో ఎల్ నినో పరిస్థితుల వైపు వాతావరణం మారుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం భూ మధ్య రేఖ పసిఫిక్ మహా సముద్రం వేడెక్కుతూ ఉందని.. క్రమంగా ఎల్ నినో పరిస్థితుల వైపు మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నైరుతి రుతు పవనాల కాలంలోనే అంటే.. జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలోనే ఎల్ నినో పరిస్థితులు ఏరన్పడతాయని అంచనా వేస్తోంది. ఇదే జరిగితే ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం కష్టమే. 

గడిచిన ఏప్రిల్ నెలను పరిశీలిస్తే.. దక్షణాది రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. దక్షణాది రాష్ట్రాలతో పోల్చితే.. ఉత్తరాది రాష్ట్రాల్లో కొంచెం తక్కువగానే ఎండలు ఉన్నాయని స్పష్టం చేసింది భారత వాతావరణ శాఖ.

©️ VIL Media Pvt Ltd.