Reading Time: < 1 minute

పంజాబ్ అసెంబ్లీలో హైడ్రామా.. సీఎం మద్యం సేవించి వచ్చారంటూ ప్రతిపక్షాల ఆరోపణ..ఆల్కహాల్ టెస్ట్ చేయాలంటూ డిమాండ్

Caption of Image.

పంజాబ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మే1న కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు హాజరయ్యారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు పెను సంచలనాన్ని సృష్టించాయి.

 ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వచ్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బాజ్వా.. సభలోని శాసనసభ్యులందరికీ  వెంటనే  ఆల్కహాల్ టెస్ట్ చేయాలని  డిమాండ్ చేశారు. సీఎంపై ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు నిజానిజాలు తేలాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

శిరోమణి అకాలీ దళ్ సైతం ఈ వివాదంలోకి  ఎంటరైంది. అసెంబ్లీలో  సీఎం ప్రవర్తనకు సంబంధించిన వీడియోలను విడుదల చేస్తూ.. కార్మిక దినోత్సవం నాడు ఇలా మద్యం సేవించి రావడం పంజాబ్‌కు సిగ్గుచేటని మండిపడింది. పంజాబ్ ప్రజల సమక్షంలోనే భగవంత్ మాన్‌కు డోపింగ్  టెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.ఈ గందరగోళంపై స్పందించిన సీఎం భగవంత్ మాన్.. ఈ సమావేశం కార్మికులకు గౌరవప్రదంగా కేటాయించినదని.. సభ్యులందరూ అనవసర వాదనలు మానుకొని సభా మర్యాదను కాపాడాలని కోరారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరడంతో పంజాబ్ రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ఈ క్రమంలోనే.. ప్రభుత్వం తన పదవీకాలం ముగిసే దశలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం వల్ల కార్మికులకు వచ్చే లాభమేంటని కాంగ్రెస్ నేత వారింగ్ ప్రశ్నించారు.
 

©️ VIL Media Pvt Ltd.