Reading Time: < 1 minute
Iran Warning Us Strait Of Hormuz Tensions Mojtaba Khamenei Trump Sanctions

Mojtaba Khamenei: అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గల్ఫ్ ప్రాంత భద్రతను ఇకపై ఇరాన్ స్వయంగా చూసుకుంటుందని, ఈ సముద్ర మార్గంలో శత్రువుల జోక్యాన్ని ఇకపై ఏమాత్రం సహించేది లేదని తెగేసి చెప్పారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అలజడి సృష్టించే విదేశీ శక్తులకు ఇక్కడ చోటు లేదని, ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారిని సముద్ర గర్భంలో పాతిపెడతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలను తొలగించాలన్న ప్రతిపాదనను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన నేపథ్యంలో ఖమేనీ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఆంక్షలు ఎత్తివేసే వరకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది. మార్చి నెల నుంచి ఈ మార్గం మూతపడటంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోయి, గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడుతోంది. గల్ఫ్, హోర్ముజ్ ప్రాంతాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని, ఇక్కడ ఏర్పాటు కాబోయే కొత్త వ్యవస్థ వల్ల శాంతి నెలకొనడమే కాకుండా పొరుగు దేశాలకు ఆర్థిక ప్రయోజనాలు సైతం దక్కుతాయని ఖమేనీ ధీమా వ్యక్తం చేశారు.

అదే సమయంలో అమెరికా ఉనికిపై సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పర్షియన్ గల్ఫ్‌లో అభద్రతకు అమెరికా ఉండటమే ప్రధాన కారణమని, తమ స్వంత స్థావరాలనే రక్షించుకోలేని అమెరికా ఇతర దేశాలకు ఏం రక్షణ కల్పిస్తుందని ఎద్దేవా చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఇప్పటికే గల్ఫ్ ప్రాంతంలో పలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ చమురు వ్యాపారం ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఇతర గల్ఫ్ దేశాలతో సమన్వయం పెంచుకుని ఈ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఇదే క్రమంలో శత్రువులను వణికించేలా ఇరాన్ నేవీ కమాండర్ ఒక శక్తివంతమైన కొత్త ఆయుధాన్ని ప్రస్తావించగా, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ జోక్యం చేసుకునే వారికి సముద్రపు లోతులే గతి అని ఖమేనీ హెచ్చరించారు.