Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Bhatti Vikramarka : రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో విద్యుత్ సరఫరా పై ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో భానుడి భగభగలకు తోడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీలు, కూలర్ల వాడకం విపరీతంగా పెరిగిందని అధికారులు మంత్రికి వివరించారు. దీనికి వ్యవసాయ అవసరాలు కూడా తోడవడంతో గ్రిడ్‌పై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ మార్కెట్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రులు, తాగునీటి సరఫరా పథకాలు మరియు అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విద్యుత్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వివరించారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ స్థిరంగా ఉందని, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేశామని అధికారులు మంత్రికి హామీ ఇచ్చారు.
పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అన్ని వర్గాల వినియోగదారులకు నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరాను కొనసాగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, క్షేత్రస్థాయి సిబ్బందిని నిరంతరం అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు.