Reading Time: 2 minutes

ఈ రోజుల్లో చాల మంది తిన్న తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ పట్టేయడం వంటి సమస్యలతో  సతమతమవుతున్నారు. ట్యాబ్లెట్లు వేసుకుంటే అప్పటికప్పుడు తగ్గుతుంది కానీ మళ్ళీ మామూలే. అయితే ప్రముఖ యోగా గురువు డాక్టర్ యోగేంద్ర హంసజీ చెబుతున్న ప్రకారం.. యోగా ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. కేవలం రెండు ఆసనాలు క్రమం తప్పకుండా వేయడం ద్వారా మీ జీర్ణక్రియ ఎలా మెరుగుపడుతుందో గ్యాస్ సమస్య ఎలా మాయమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్యాస్ సమస్యకు కారణాలివే: నేటి కాలంలో అస్తవ్యస్తమైన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి వంటివి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇక వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందుకే యోగాను ఆశ్రయించడం ఉత్తమ మార్గం.

పవన్ముక్తాసనం: గ్యాస్‌కు చెక్: పేరులోనే ఉన్నట్టుగా ఇది కడుపులో పేరుకుపోయిన గ్యాస్‌ను బయటకు పంపుతుంది. వీపు మీద పడుకుని, ఒక మోకాలిని ఛాతీ దగ్గరకు తెచ్చి గట్టిగా నొక్కాలి. ఇక తలను పైకెత్తి గడ్డాన్ని మోకాలికి ఆనించి లోతుగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొట్టలోని అవయవాలకు మసాజ్ జరిగి, గట్ హెల్త్ మెరుగుపడుతుంది. భోజనం చేసిన గంట తర్వాత ఇది ప్రాక్టీస్ చేయవచ్చు.

Struggling with Gas and Bloating? Try These Yoga Asanas for Relief
Struggling with Gas and Bloating? Try These Yoga Asanas for Relief

మార్జారాసనం: వెన్నెముకకు, పొట్టకు మేలు: దీనిని ‘క్యాట్ పోజ్’ అని కూడా అంటారు. మోకాళ్లపై నిలబడి, చేతులను నేలకి ఆనించి ఆవు లేదా పిల్లి ఆకారంలోకి రావాలి. గాలి పీలుస్తూ వీపును వంచి ఆకాశం వైపు చూడాలి, గాలి వదులుతూ వీపును పైకి ఎత్తి పొట్టను లోపలికి నొక్కాలి. ఇక ఈ ఆసనం పొట్టపై తేలికపాటి ఒత్తిడిని కలిగించి, గ్యాస్ వల్ల వచ్చే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది వెన్నెముకను కూడా ఫ్లెక్సిబుల్‌గా మారుస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఈ ఆసనాల వల్ల పొట్టలోని భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మందులు వాడటం వల్ల తాత్కాలికంగా ఉపశమనం దొరికినా, యోగా వల్ల శరీరం సహజంగానే ఆహారాన్ని అరిగించుకునే శక్తిని పొందుతుంది. ప్రతిరోజూ కేవలం పది నిమిషాల సమయం కేటాయిస్తే, జీర్ణక్రియకు సంబంధించిన అసౌకర్యాలన్నీ తొలగిపోతాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటు సరైన శారీరక క్రియ కూడా అవసరం. గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మెడిసిన్ కన్నా యోగాసనాలే ఎంతో మేలు. సహజమైన పద్ధతిలో మీ పొట్టను ప్రశాంతంగా ఉంచుకోండి.

గమనిక: ఏదైనా తీవ్రమైన వెన్నునొప్పి లేదా శస్త్రచికిత్సలు జరిగిన వారు ఈ ఆసనాలు వేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. యోగా నేర్చుకునేటప్పుడు సరైన భంగిమలో చేయడం వల్ల ఫలితాలు త్వరగా అందుతాయి.

The post పొట్టలో గ్యాస్ తగ్గాలా? ఈ యోగా ఆసనాలు ట్రై చేయండి appeared first on Manalokam – Latest Telugu News & Updates.