Reading Time: < 1 minute
మాకొద్దు బాబోయ్‌ యుద్ధం.. ప్రభుత్వాధినేతలపై పబ్లిక్‌ రివర్స్‌.. యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు

ఆ మూడు దేశాల నేతలు.. యుద్ధం విషయంలో అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అయితే అక్కడి జనం మాత్రం మాకొద్దు బాబోయ్‌ ఈ యుద్ధం అంటున్నారు. అనడమే కాదు.. రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్తంగా ఇరాన్‌తో తలపడుతున్నాయి. ఆయా దేశాల ప్రజలు మాత్రం తమ నేతలపై తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధం వద్దని, శాంతి ముద్దని నినదిస్తున్నారు.

నేతలేమో యుద్ధం శరణం గచ్ఛామి అంటున్నారు. ప్రజలేమో శాంతి శరణం గచ్ఛామి అంటున్నారు. గల్ఫ్‌ వార్‌తో ప్రపంచం వణికిపోతోంది. ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌, ఓ రేంజ్‌లో యుద్ధం చేస్తున్నాయి. అయితే యుద్ధానికి వ్యతిరేకంగా ఆయా దేశాల ప్రజలు గళం విప్పుతున్నారు. తమ పాలకులపై రివర్స్‌ అవుతున్నారు.

ఇరాన్‌ సర్కార్‌పై అక్కడి పబ్లిక్‌ తిరుగుబాటు చేస్తున్నారు. యుద్ధం వద్దంటూ నినదిస్తున్నారు. అయితే ఆ నిరసనలను IRGC దళాలు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాయి. పాలకులపై తిరుగుబాటు చేస్తే, అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, జనవరి నిరసనలను ఎంత నిర్దాక్షిణ్యంగా అణచివేశామో, అంతకంటే దారుణంగా తొక్కేస్తామని, ప్రజలకు వార్నింగ్‌ ఇచ్చారు రివల్యూషనరీ గార్డ్స్‌. ఇరాన్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా జనవరిలో జరిగిన నిరసనల్లో, వేలాదిమంది ఆందోళనకారులను భద్రతా దళాలు ఊచకోత కోశాయి.

ఇక అమెరికాలో కూడా ఇలాంటి సీనే కనిపిస్తుంది. ఇరాన్‌తో యుద్ధం వద్దంటూ రోడ్లెక్కుతున్నారు అక్కడి జనం. ట్రంప్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా వాషింగ్టన్‌, న్యూయార్క్‌తో పాటు పలు నగరాల్లో కదం తొక్కారు. గ్యాస్‌ కష్టాలు ఎక్కువ కావడంతో అమెరికన్లు ట్రంప్‌పై మండిపడుతున్నారు. ఇరాన్‌ దాడుల్లో చనిపోయిన 8మంది సైనికుల మృతదేహాలు అమెరికాకు చేరడంతో, ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు.

ఇక ఇజ్రాయెల్‌లోనూ సేమ్‌ సీన్లు కనిపిస్తున్నాయి. అక్కడి పబ్లిక్‌ కూడా రివర్స్‌ అవుతున్నారు. ఇరాన్‌ ప్రయోగిస్తున్న మిస్సైల్స్‌, డ్రోన్లు ఇజ్రాయెల్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఐరన్‌ డోమ్‌ వ్యవస్థ తమను కాపాడలేకపోతోందంటూ, దేశం నుంచి వెళ్లిపోయేందుకు ఇజ్రాయెలీలు ప్రయత్నిస్తున్నారు. దీంతో టెల్‌అవివ్ ఎయిర్‌పోర్టులో గందరగోళ వాతావరణం నెలకొంది. ఫ్లైట్‌ టికెట్ల కోసం ప్రయాణికులు ఘర్షణకు దిగారు. ఎయిర్‌లైన్స్‌ ఆపరేటర్లతో గొడవకు దిగి, విధ్వంసం సృష్టించారు. మొత్తానికి మూడు దేశాల ప్రజలు.. తమ పాలకుల మీద తిరగబడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..