Reading Time: < 1 minute

నన్ను చంపక ముందే.. నేనే అతన్ని చంపా: ఖమేనీ హత్యపై ట్రంప్

Caption of Image.

వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఖమేనీ తనను చంపక ముందే తానే అతన్ని చంపేశానని అన్నాడు. ఖమేనీ బతికుంటే తన ప్రాణాలకు ఎప్పటికైనా ముప్పేనని పేర్కొన్నాడు. గతంలో రెండు సార్లు తనను చంపేందుకు ఖమేనీ ప్రయత్నించాడని ఆరోపించారు. 2024లో తనపై జరిగిన దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందన్నారు. 

తీరు మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఖమేనీ వినిపించుకోలేదని.. చరిత్రలో అత్యంత దుర్మార్గులలో అతడు ఒకడని విమర్శించాడు. ఖమేనీ చావుతో ఇరాన్, అమెరికాతో పాటు ఇరాన్ బాధిత దేశాలకు న్యాయం జరిగిందన్నారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమని పేర్కొన్నారు. రాచరిక పాలనకు అంతం పలికి ప్రజాస్వామ్య పాలన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

2026, మార్చి 1న అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజధాని టెహ్రాన్న‎లో ఉన్నతాధికారులతో ఖమేనీ ఓ కీలక మీటింగ్ నిర్వహిస్తోన్న వేళ పక్కా సమాచారంతో అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేశాయి. 

ఈ దాడిలో ఖమేనీతో పలువురు ఇరాన్ అగ్ర నాయకులు హతమయ్యారు. అలాగే.. ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా నలుగురు చనిపోయారు. ఖమేనీ మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. ఆయన మరణానికి 40 రోజుల సంతాప దినాలు ప్రకటించింది.

©️ VIL Media Pvt Ltd.