Reading Time: 2 minutes
Sanju Samsons Bold Remarks On Rohit Sharmas Opening Role Go Viral After Match Winning Knock

Sanju Samson Bold Comments on Opener Rohit Sharma: భారత వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడని పేర్కొన్నాడు. టీ20 వరల్డ్‌ కప్‌లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్‌ప్లేలో ఇబ్బంది పడ్డాడన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో వచ్చి పరుగుల వరద పారించే వాడని.. అందుకే టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదని చెప్పాడు. గత 10–12 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ కప్‌లలో భారత్ బాగా ఆడుతున్నప్పటికీ.. ఓపెనింగ్ విభాగంలో ఇతర జట్లతో పోలిస్తే కొంత వెనుకబడి ఉండేదని సంజు అభిప్రాయపడ్డాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2026 సూపర్-8లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సులతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డూ ఆర్ డై మ్యాచ్, భారీ లక్ష ఛేదన.. అందులోనూ వరుసగా వికెట్స్ పడుతున్నా సంజు బెదరలేదు. సహచరులతో చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ.. జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. భారత్ స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్, హార్దిక్ పాండ్యలు క్యాచ్ అవుట్ నుంచి తప్పించుకున్నా.. పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. సంజు మాత్రం ఒక్క అవకాశం ఇవ్వకుండా.. చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం టీమిండియా ఓపెనింగ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Also Read: Sanju Samson Comeback: అవకాశాల్లేవు, ఛీకొట్టారు, రిటైర్మెంట్ అన్నారు.. కట్ చేస్తే ‘జెనరేషన్ నాక్’తో నోళ్లు మూయించాడు!

‘గత 10–12 సంవత్సరాలుగా భారత్ ఎప్పుడూ టీ20 ప్రపంచ కప్‌లలో బాగా ఆడుతోంది. కానీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఇతర జట్లతో పోలిస్తే భారత్ స్థిరమైన ప్రదర్శన చేయలేదు. విరాట్ భయ్యా 3వ స్థానంలో వచ్చి పరుగులు చేసేవాడు. కాబట్టి టీమిండియా ఓపెనర్ల బలహీనత పెద్దగా బయటపడలేదు. టీ20 ప్రపంచ కప్‌లలో రోహిత్ భాయ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి పవర్‌ప్లేలో ఇబ్బంది పడ్డాడు. దాంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పడేది. రోహిత్ ఓపెనర్‌గా చేయలేనిది నేను చేయాలనుకున్నా. నన్ను నేను నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నా. టీ20 ప్రపంచ కప్‌ ఛేదనలో రోహిత్ భాయ్ తన కెరీర్‌లోనే ఒక్క మేటి ఇన్నింగ్స్ కూడా ఆడలేదు’ అని సంజు శాంసన్ వివరించాడు.

రోహిత్ శర్మ టీ20 వరల్డ్‌కప్‌లలో ఛేజ్ చేస్తూ మ్యాచ్ గెలిపించిన సందర్భాలు చాలా అరుదు అని సంజు శాంసన్ అన్నాడు. తాను జట్టుకు ఆ దిశగా ఉపయోగపడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పాడు. తన ప్రదర్శనతో జట్టుకు బలమైన ఆరంభం అందించడమే ప్రధాన ఉద్దేశమని సంజు చెప్పుకొచ్చాడు. సంజు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు అభిమానులకు ఇది విశ్లేషణగా కనిపిస్తుండగా.. మరికొందరు మాత్రం వివాదాస్పదంగా భావిస్తున్నారు. ఏదేమైనా ఒంటిచేత్తో వెస్టిండీస్‌పై మ్యాచ్ గెలిచింపిన సంజుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.