Reading Time: 2 minutes

మెక్సికోలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సిజెఎన్ జి ) నాయకుడు నెమెసియో రూబోన్ ఒసేగురా సెర్వాంటెస్ , అకా ఎల్ మెంచో సైన్యం దాడిలో చనిపోయాడు. దీంతో ప్రతీకార దాడుల నేపథ్యంలో హైవేలను దిగ్బంధం చేశారు. పలు విమానాలను రద్దు చేశారు. అమెరికా కూడా మెక్సికో లోని పలు పట్టణాలకు విమాన సర్వీసులను నిలిపివేసింది. అమెరికా, కెనడాలలో సెక్యూరిటీ అలర్ట్ లను ప్రకటించారు. మెక్సికో డ్రగ్ మాఫియా ఎంత బలమైనదంటే, వారు సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారు. అలాంటి ముఠా అగ్రనాయకుడు హతమైతే, అల్లకల్లోలం జరగవచ్చునన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి.మెక్సికో లోని జాలిస్కో స్టేట్ లో టపాల్పా పట్టణంలో ఆదివారం మెక్సికన్ సైన్యం ఎల్ మెంచో ముఠాకు చెందిన దుండగులతో సాయుధ ఘర్షణకు దిగింది. కాల్పుల్లో ఒసేగురా గాయపడ్డాడు. చికిత్స కోసం మెక్సికో నగరానికి విమానంలో తలరిస్తుండగా, అతడు చనిపోయినట్లు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అతడి తలపై 15 మిలియన్ అమెరికా డాలర్ల బహుమతి ఉంది. 59 ఏళ్ల జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ నాయకుడు ఇటు మెక్సికో లోను, అటు అమెరికాలోనూ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకడు. ఎల్. మెంచో తోపాటు అతడి ముఠాకు చెందిన ఆరుగురు ఈ ఆపరేషన్ లో చనిపోయినట్లు సైన్యం తెలిపింది. ఆపరేషన్ లో ముగ్గురు మెక్సికన్ సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంతో పాటు ముఠా సభ్యులనుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో విమానాలను కూల్చివేయగల రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి.ఎల్. మెంచో మరణం తర్వాత కార్టెల్ ముఠా సభ్యులు తీవ్ర హింసా, దౌర్జన్య కాండకు పూనుకున్నారు. జాలిస్కో, మిచోకాన్ స్టేట్ లలో వాహనాలకు నిప్పుపెట్టారు. రహదారులను దిగ్బంధం చేశారు. సైనిక ఆపరేషన్ లో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రదేశం ప్యూర్టో వల్లర్టా పై హెలికాప్టర్ల రాకపోకలు దాదాపు నిలిచి పోయినట్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపాయి.

మెక్సికన్ డ్రగ్ కార్టెల్ బాస్ లలో అత్యంత శక్తివంతుడైన ఎల్.మెంచో ను ఒకప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో చేర్చింది అంటే అతడిని అంచనా వేయవచ్చు. మెక్సికోలో శక్తివంతమైన మాదక ద్రవ్య సామ్రాజ్యం విస్తరించడం వెనుక చైనా సంబంధాలు కూడా కీలకం. ఒసేగురా మరణం, తర్వాత సినాలోవా కార్టెల్ బాస్ జోక్విన్ ఎల్ . చాపో గుజ్మాన్ వంటి వారిని తొలగించే ఆపరేషన్ సాగవచ్చు. ఎల్. చాపో, ఎల్. మెంచో వంటి వారి కథనాలతో లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు మెక్సికోను ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవచ్చు.