
తన పేరుతో ఎలాంటి సంస్థను కూడా ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కొంతమంది ‘కెటిఆర్ సేవా సమితి’, ‘కెటిఆర్ సేన’ పేరుతో కొన్ని కార్యకలాపాలు చేపడుతున్న విషయాన్ని పలువురు కెటిఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వీటితోపాటు కెటిఆర్ పేరుతో ఇతర సంస్థలను ఏర్పాటు చేసుకున్న అంశాన్ని కూడా కెటిఆర్‌కి తెలియజేశారు. తన పేరుతో నిర్వహిస్తున్న సంస్థలపై ఆయన స్పందిస్తూ తన పేరుతో ఎలాంటి సంస్థలకీ అనుమతి లేదని… అలాంటి ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని తేల్చిచెప్పారు. ఇలాంటి సంస్థలకు ఎటువంటి గుర్తింపు, అనుమతి లేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.ఎవరైనా పనిచేయాలనుకుంటే కచ్చితంగా భారత రాష్ట్ర సమితి పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను నిలిపివేయాలని, తనపై అభిమానం ఉన్నవాళ్లు ఎవరైనా బిఆర్‌ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలని సూచించారు.