Reading Time: 2 minutes

మహాలయ పక్షంలో పితృ దేవతలను ఎందుకు పూజించాలి.. మహాభారతంలోని కర్ణునికి జరిగింది ఇదే..!

Caption of Image.

భాద్రపదమాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఎంత విశిష్టమైనదో , బహుళ పక్షం పితృదేవతాపూజలకు అంత శ్రేష్ఠమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనుక దీనికి పితృపక్షమని , మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ , శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతిచెందారో , ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి.

హిందువుల ఆచారం ప్రకారం .. సంప్రదాయంగా కాలం చేసిన తల్లిదండ్రులు.. తాతముత్తాతల ఆత్మ ప్రతి ఏటా వారి తిథి రోజు వారసుల దగ్గరకు ఆకలి .. దప్పికతో వస్తారు.  కాని ఆచారం ప్రకారం  వారి తిథి రోజున శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు.  అలా నిర్వహించలేకపోయిన మహాలయ పక్షాల్లో తిథి రోజున తర్పణాలు వదులుతారు.  మహాలయ పక్షాల సమయంలో అంటే ఈ ఏడాది ( 2026) సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్​ 10 వరకు ఉన్న రోజుల్లో పితృ దేవతలు పూజలు అందుకోవడానికి స్వర్గ లోకాధిపతి ఇంద్రుడు.. యమలోకాధిపతి   యమ ధర్మరాజు భూలోకానికి  వెళ్లేందుకు అనుమతి ఇస్తారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇలా వారు భూలోకానికి వచ్చి .. వాని వారసులు ఇచ్చే పిండప్రదానాలు..తర్పణాలు కోసం ఎదురు చూస్తుంటారు. 

పురాణాల ప్రకారం   మహాభారతంలో దానశీలిగా పేరుపొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి , దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం ! ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు , మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. 

ఇలా లాభం లేదనుకుని కనీసం దప్పిక యినా తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటి ముందుంచుకున్నాడు. ఆ నీరు కాస్తా బంగారపు నీరుగా మారిపోయింది.స్వర్గలోకానికెళ్లాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి , తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోయాడు …కర్ణా ! నీవు దానశీలిగా పేరు పొందావు. 

చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారం , వెండి , డబ్బు రూపేణా చేశావు గానీ , కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది’.. అని శరీరవాణి పలుకులు వినిపించాయి. 

కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి పరిపరివిధాల ప్రాధేయపడగా , ఆయన కోరిక మేరకు దేవరాజయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి , మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు.

ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు , బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. 

ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది , ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి , తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

మహాలయ పక్షాల సమయంలో నది తీరాలలో లేదా పుణ్యక్షేత్రాలలో తిలహోమం, నారాయణ బలి పూజ ఆచరించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు స్వయంపాకం (బియ్యం, కూరగాయలు) దానం చేయడం, పేదలకు అన్నదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. కాకులకు, గోవులకు రోజూ ఆహారం పెట్టడం వల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. ఈ పితృ పక్షాల సమయంలో  కేవలం పితృదేవతల ఆరాధనకే సమయాన్ని కేటాయిస్తారు. భక్తిశ్రద్ధలతో మన పూర్వీకులను స్మరిస్తూ ఈ మహాలయ పక్షంలో తర్పణాలు అర్పించి వారి ఆశీస్సులు పొందడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

 

©️ VIL Media Pvt Ltd.