Reading Time: 2 minutes

ఒకే రోజు వన్డేల్లో 6 సెంచరీలు.. క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారి!

Caption of Image.

Six ODI Centuries Single Day: అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఒకే రోజు ఏకంగా 6 శతకాలు (6 ODI Centuries) నమోదయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 27, 2026) నాడు పరుగుల వర్షం కురిసిన సూపర్ సండేగా నిలిచిపోయింది. ఆ రోజున జరిగిన మూడు వేర్వేరు వన్డే మ్యాచ్‌ల్లో (తిరువనంతపురంలో భారత్ వర్సెస్ వెస్టిండీస్, జోహన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, లండన్ ఓవల్‌లో ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక) బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు. విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, జస్టిన్ గ్రీవ్స్, టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్, టామ్ బాంటన్ ఈ చారిత్రాత్మక రికార్డులో భాగస్వాములయ్యారు. వన్డేల్లో ఒకే రోజు ఆరు సెంచరీలు నమోదు కావడం క్రికెట్ చరిత్రలోనే ఇదే తొలిసారి.

భారత్‌కు ఘన విజయం అందించిన కోహ్లీ: 

వన్డేల్లో తన రికార్డుల పరంపరను కొనసాగిస్తూ విరాట్ కోహ్లీ మరోసారి విజృంభించారు. వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్‌లో కేవలం 88 బంతుల్లోనే 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 139 రన్స్ సాధించారు. కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో 15,000 పరుగుల మార్కును అందుకున్న రెండవ బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్‌లో మరో రెండు శతకాలు కూడా నమోదయ్యాయి. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (108 బంతుల్లో 110) బాధ్యతాయుత సెంచరీ చేయగా, వెస్టిండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ (108 బంతుల్లో 101) తొలి వన్డే శతకంతో రాణించారు.   

ఆస్ట్రేలియాను దెబ్బతీసిన బావుమా, మిల్లర్ సెంచరీలు: 

జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 50 ఓవర్లలో దక్షిణాఫ్రికా 365/9 భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ టెంబా బావుమా (116 బంతుల్లో 103) శతకంతో పునాది వేయగా, విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (93 బంతుల్లో 142) 12 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగిపోయారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (84), ట్రావిస్ హెడ్ (84) పోరాడినప్పటికీ సెంచరీలకు చేరువలో అవుటయ్యారు. దాంతో ఆస్ట్రేలియా 32 రన్స్ తేడాతో ఓడిపోయింది. 

►ALSO READ | సచిన్ 100 సెంచరీల రికార్డుపై కోహ్లీ నజర్: శతకాల మైలురాయిని విరాట్ చేరగలడా? లెక్కలు ఇవిగో!

శ్రీలంకను చిత్తు చేసిన టామ్ బాంటన్ విధ్వంసం: 

లండన్ లోని ఓవల్‌ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్ టామ్ బాంటన్ కిరాక్ బ్యాటింగ్‌తో అలరించారు. 105 బంతుల్లోనే 126 రన్స్ కొట్టి సాధించి ఇంగ్లీష్ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బాంటన్ సెంచరీ సాయంతో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 337/5 రన్స్ చేయగా, భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక కేవలం 29.1 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లాండ్ 223 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో వేర్వురు వన్డే మ్యాచుల్లో 6 సెంచరీలు నమోదు అయ్యాయి. 
 

©️ VIL Media Pvt Ltd.