Reading Time: < 1 minute
Attica Gold Ed Raids Illegal Gold Purchase Case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఉక్కుపాదం మోపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాలు, శాఖలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, షేర్‌హోల్డర్లు, పూర్వపు డైరెక్టర్లు అలాగే పలు అనుబంధ సంస్థలకు చెందిన కార్యాలయాలు, నివాసాలలో ఈ తనిఖీలు సాగాయి.

దొంగిలించిన బంగారమే లక్ష్యంగా కొనుగోళ్లు…
పోలీసు స్టేషన్లలో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ముమ్మరం చేసింది. నేరపూరిత మార్గాల ద్వారా సేకరించిన సొత్తుపై ప్రధానంగా దృష్టి సారించింది. దొంగతనం చేసిన బంగారాన్ని అట్టికా గోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తోందని, ఇలా అక్రమ పద్ధతిలో సేకరించిన బంగారం ద్వారా భారీగా నేర ఆదాయం సమకూరిందని అధికారులు గుర్తించారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, హవాలా మార్గాలు , ఆర్థిక అక్రమాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.

విదేశీ కరెన్సీ, బంగారం, వెండి సీజ్..
ఈ రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సోదాలలో ఈడీ అధికారులకు కీలక ఆధారాలు లభించాయి. తనిఖీలలో భాగంగా రూ. 7.52 లక్షల నగదుతో పాటు భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాల సమయంలో కంపెనీకి సంబంధించిన కీలక వ్యక్తులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. పి.ఎస్. ఆయుబ్ అలియాస్ బొమ్మనహళ్లి బాబు, ఒబేదుల్లా ఎ., మొహమ్మద్ సల్మాన్ ఎ., అర్బిన్ తాజ్ ఎ. తదితరుల నివాసాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. అయితే, ఈడీ విచారణకు సహకరించకుండా కొందరు కీలక వ్యక్తులు, డైరెక్టర్లు పరారైనట్లు అధికారులు వెల్లడించారు.

సోదాల సమయంలో వ్యాపార కేంద్రాల్లోని సిబ్బందిని సైతం కొందరు వ్యక్తులు అందుబాటులో ఉండవద్దని ఆదేశించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, వస్తువుల ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు.