
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి, పేద ప్రజలకు బయట తినడం అంటేనే గుండె గుభేల్ మంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో హోటల్ యజమానులు ధరలను విపరీతంగా పెంచేస్తున్నారు. గతంలో ఉన్న పరిస్థితులు కాస్త కుదుటపడినా… వినియోగదారుడికి మాత్రం ఆ వెసులుబాటు దక్కడం లేదు. ప్రతి చిన్న మార్పును తమకు అనుకూలంగా మార్చుకుంటూ కస్టమర్లను నిలువునా దోచుకుంటున్నారు.
హోటల్ నిర్వాహకులు ధరలు పెంచడానికి ప్రధానంగా వినియోగిస్తున్న ఆయుధం ‘గ్యాస్ సిలిండర్’. సిలిండర్ ధరలు స్వల్పంగా పెరిగినా లేదా స్థిరంగా ఉన్నా.. ‘సకాలంలో సిలిండర్లు దొరకడం లేదు’, ‘బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తోంది’ అనే సాకులు చెబుతూ మెనూ కార్డులోని ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
కమర్షియల్ సిలిండర్ల కొరత ఉందని చెబుతూ.. అనధికారికంగా ఎక్కువ ధరకు కొంటున్నామనే వంకతో ఇడ్లీ, దోశ నుంచి బిర్యానీ వరకు అన్నింటి ధరలపై భారీగా పెంచుతున్నారు. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే టిఫిన్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. చట్నీ, సాంబార్ వంటి అదనపు వసతుల పేరుతో కూడా అదనపు బాదుడు తప్పడం లేదు.
హైదరాబాద్‌లోని ఇరానీ కేఫ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ధరల పెరుగుదల ఒక రేంజ్‌లో ఉంది. ఇదే ధోరణి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లోనూ కనిపిస్తోంది. పప్పులు, నూనె ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు చేరవేయని యజమానులు, ఏదైనా ఒక వస్తువు ధర పెరగగానే మాత్రం వెంటనే బిల్లు పెంచేస్తున్నారు. సిలిండర్ల సరఫరాలో చిన్న అంతరాయం కలిగినా, అది హోటల్ మెనూలో భారీ మార్పులకు దారితీస్తోంది.
నిజానికి సిలిండర్ ధరల పెరుగుదలపై ప్రభుత్వాల నియంత్రణ ఉన్నప్పటికీ.. హోటళ్లలో వసూలు చేసే ధరలపై పర్యవేక్షణ కరువైందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బ్లాక్ లో సిలిండర్లు కొంటున్నాం’ అని బహిరంగంగా చెబుతున్నా, అటు అధికారులు కానీ, ఇటు సరఫరాదారులు కానీ పట్టించుకోకపోవడం హోటల్ యజమానులకు వరంగా మారింది. ఇప్పటికే హోటళ్లలో ఏది తీసుకోవాలన్నా పాత ధర కంటే అదనంగా రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తుండగా.. నేడు కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగడంతో కొన్ని హోటళ్లలో అదనంగా మరో రూ.20 వసూలు చేస్తున్నట్లు కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామాన్యుడు కష్టపడి సంపాదించిన డబ్బులో సగం కడుపు నింపుకోవడానికే సరిపోతోంది. గ్యాస్ సిలిండర్ దొరకడం లేదనే నెపంతో వినియోగదారులను మోసం చేయడం సరైన పద్ధతి కాదు. పారదర్శకమైన ధరలు ఉండాలని, సాకులు చెప్పి దోచుకునే హోటళ్లపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.