
హైదరాబాద్‌లోని హోటల్ యజమానులు, ఫుడ్ స్టాల్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మే 1, 2026 శుక్రవారం ఉదయం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.994 పెరగడం భాగ్యనగర ఫుడ్ బిజినెస్ యజమానులను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న చిన్న వ్యాపారులు.. కొత్తగా పెరిగిన ధరలతో తమ దుకాణాలు మూసుకోవాలా లేక రేట్లు పెంచి కస్టమర్లను వదులుకోవాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.
అమీర్‌పేట, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ వంటి ప్రాంతాల్లో హాస్టళ్లు, పీజీల్లో ఉండే ఐటీ విద్యార్థులు, గిగ్ వర్కర్లే లక్ష్యంగా నడిచే చిన్నపాటి ఇడ్లీ, వడ బండ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. “మా రోజులు వచ్చాయి అన్నమాట” అంటూ ఉషారాణి అనే టిఫిన్ సెంటర్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలోనే ఇడ్లీ ప్లేట్ ధరను రూ.30 నుండి రూ.35కు పెంచామని.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెంచితే కస్టమర్లు రారని ఆమె భయపడుతున్నారు. అధికారికంగా ధర పెరగకముందే బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్‌ను రూ.6వేల నుంచి రూ.6వేల 500 వరకు కొంటున్నామని, ఇప్పుడు రేట్ల పెంపుతో బ్రోకర్లు ఇంకా గ్యాస్ రేటు పెంచేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
యూసుఫ్‌గూడలోని చిన్న చిన్న కర్రీ పాయింట్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గ్యాస్ ధర 40 శాతం పెరిగినప్పటికీ.. మిడిల్ క్లాస్ ఏరియాల్లో కర్రీ ధరలు పెంచడం సాధ్యం కాదని యజమానులు చెబుతున్నారు. గతంలోనే గ్యాస్ కొరత, ధరల పెరుగుదల వల్ల కూకట్‌పల్లి ఫుడ్ స్ట్రీట్‌లోని కొన్ని రెస్టారెంట్లు వారం రోజుల పాటు మూతపడ్డిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందని చాలా మంది చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ భారాన్ని తట్టుకోలేక ఇప్పటికే కొన్ని హోటళ్లు కట్టెల పొయ్యిల వైపుకు మారాయి. ముఖ్యంగా సంగారెడ్డి వంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ సిబ్బంది కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భాగ్యనగరంలో హోటల్ భోజనం ఇక సామాన్యుడికి భారంగా మారేలా ఉంది. మున్ముందు ఈ గ్యాస్ సెగలు మరిన్ని రెస్టారెంట్లను మూతపడేలా చేస్తాయా లేదా అన్నది ఆందోళనకరంగా మారింది. ఒకవైపు యుద్ధ ప్రభావంతో పెరుగుతున్న ధరలు.. మరోవైపు ప్రభుత్వ పన్నుల భారం కలిపి హైదరాబాద్ ఫుడ్ బిజినెస్ ని సంక్షోభంలో కూరుకునేలా చేస్తోంది.