Reading Time: 2 minutes
China Undersea Mapping Pacific Indian Ocean Us Submarine Threat

China: ప్రపంచ దేశాల సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు చైనా సరికొత్త ‘సముద్రగర్భ’ యుద్ధానికి తెరలేపింది. శాస్త్రీయ పరిశోధనల ముసుగులో పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్ మహాసముద్రాల్లో భారీ ఎత్తున మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టింది. అమెరికా, దాని మిత్రదేశాల జలాంతర్గాములను ముప్పు తిప్పలు పెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఆపరేషన్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

READ ALSO: Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి ఇలా..!

‘డాంగ్ ఫాంగ్ హాంగ్ 3’.. నిఘా నౌకల ప్రైవేట్ సైన్యం..
ఈ మొత్తం ఆపరేషన్‌లో చైనా సముద్ర విశ్వవిద్యాలయానికి చెందిన ‘డాంగ్ ఫాంగ్ హాంగ్ 3’ అనే నౌక కీలక పాత్ర పోషిస్తోంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ నౌక 2024 నుంచి 2025 మధ్య కాలంలో తైవాన్, గ్వామ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, మలక్కా జలసంధి వంటి కీలక ప్రాంతాలను పదేపదే చుట్టేసింది. కేవలం ఇదొక్కటే కాకుండా, డజన్ల కొద్దీ నౌకలు, వందలాది సెన్సార్లు సముద్ర గర్భాన్ని క్షుణ్ణంగా మ్యాపింగ్ చేస్తున్నాయి. సముద్రపు లోతు, ఉష్ణోగ్రత, లవణీయత (Salinity), నీటి ప్రవాహాల సమాచారాన్ని సేకరించడం వెనుక చైనాకు రెండు ప్రధాన సైనిక ప్రయోజనాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది చైనా జలాంతర్గాములు శత్రువుల కంట పడకుండా ఎక్కడ దాక్కోవచ్చో, ఏ మార్గాల్లో ప్రయాణించవచ్చో ఈ డేటా ద్వారా తెలుస్తుంది. రెండవది సముద్ర పరిస్థితులపై పట్టు ఉంటే, అమెరికా లేదా ఇతర దేశాల జలాంతర్గాముల నుంచి వెలువడే శబ్దాలను పసిగట్టి వాటిని సులభంగా వేటాడవచ్చు.

కీలక ప్రాంతాలపై నజర్
చైనా ప్రధానంగా హవాయి, గ్వామ్, జపాన్, ఫిలిప్పీన్స్ చుట్టూ ఉన్న జలాలపై దృష్టి సారించింది. చైనాకు అవసరమైన చమురు, వస్తు రవాణా మలక్కా జలసంధి గుండానే జరుగుతుంది. అందుకే ఈ ప్రాంతంపై పూర్తి అవగాహన కోసం ఇక్కడ మ్యాపింగ్‌ను ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఆర్కిటిక్ ప్రాంతంలో తన ఉనికిని చాటుకోవడానికి ఇప్పటి నుంచే సముద్రగర్భ సర్వేలను వేగవంతం చేసింది. చైనా అనుసరిస్తున్న ఈ విధానం ప్రకారం.. విశ్వవిద్యాలయాలు లేదా పౌర పరిశోధన సంస్థలు సేకరించే ఏ సమాచారమైనా నేరుగా సైన్యానికి (PLA) అందుతుంది. శాస్త్రీయ పరిశోధన పేరుతో అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించి, ఆ సమాచారాన్ని యుద్ధ తంత్రాల కోసం ఉపయోగించుకోవడం చైనాకు అలవాటుగా మారిందని అంటున్నారు. మొత్తానికి, సముద్రపు అడుగున ప్రతి కదలికను పర్యవేక్షించగలిగేలా ‘పారదర్శక సముద్రాన్ని’ సృష్టించడమే చైనా అంతిమ లక్ష్యమని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

READ ALSO: Prince Yawar: బిగ్‌బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్‌కు ‘హనీ ట్రాప్’ సెగ.. రూ.23 లక్షలు వసూలు!