Reading Time: 2 minutes

ఆత్మహత్య చేసుకోవడం అంటే చనిపోవాలని కోరుకోవడం కాదు.. లోపల ఉన్న బాధను అణచివేయడం అనే మాట మనిషికి ఆక్సిజన్. భూమిపై జీవించడమనే అసాధారణమైన ధైర్యసాహసంలో దాగొనే అత్యంత విలువైన కాలాన్ని అమృతయమం చేసుకొనే తరం. నేటి రోజుల్లో మానసిక బలహీనతతో ఊగిసలాడుతున్న ఓ బలహీన క్షణం లో ఆత్మహత్యల వైపు ప్రయాణం చేయడం ఓ విషాద పరిణామం. కఠిక పేదరికం నుండి కోటీశ్వరుడు వరకు, నిరక్షరాస్యుడి నుండి విజ్ఞానవేత్త వరకు, సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ఈ మానసిక ఒత్తిడిలో తలొగ్గి బలవన్మరణాలకు పాల్పడటం వెనుక జరుగుతున్న మానసిక తంతు నేటి సమాజం తనకు తానుగా చేసుకుంటున్న ఆత్మహత్యా సదృశం.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన విజయారెడ్డి అనే ఐటి ఉద్యోగిని తన ఇద్దరు పిల్లలతో ఒంటరితనమనే డిఫ్రెషన్‌తో రైలుకు ఎదురెళ్లి మృత్యువును కౌగిలించుకొంది. ఎంతటి విషాదం. మాతృమూర్తే తనతోపాటు తన పిల్లలకు రాసిన మరణ శాసనం ఎందరి హృదయాలను కలచివేసింది. విజయారెడ్డి ఉన్నతంగా చదువుకొంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఒకవైపు టీమ్ మేనేజర్‌గా పనిచేస్తూ, మరోవైపు గృహిణిగా, మాతృమూర్తిగా గడుపుతున్న జీవితానికి తనకు తానుగా రాసిన మరణ శాసనానికి ఏ చదువు అక్కరకు వచ్చింది..? భర్త దూరంగా ఉండటం, ఒంటరితనమనే భయం, తాను లేకపోతే పిల్లల భవిష్యత్‌లో బతకలేరనే ఆందోళనా..? మరే ఇతర కారణాలో తెలియదుగానీ.. పదిమందికి ఆదర్శప్రాయంగా నిలబడాల్సిన విజయారెడ్డి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. తన ఇద్దరి పిల్లల జీవితాలను ముగించేసింది. అతిచిన్న వయస్సులో వ్యాపార రంగంలో కోట్లకు పడగలెత్తి 36 సంవత్సరాల వయస్సుకే సొంత విమానం, 12 రోల్స్ రాయిస్ కార్లతో సహ వందల ఎకరాలకు యజమానియైన బెంగళూరుకు చెందిన సిజె రాయ్ ఒత్తిడి తట్టుకోలేక చివరికి గన్‌తో కాల్చుకొని సగం జీవితం కూడా నిండకముందే ఆత్మహత్యకు పాల్పడటం ఇటీవల కాలంలో సంచలనం కలిగించింది. వ్యాపారంలో ఆటుపోటులకు తట్టుకొని ఎదిగిన క్రమంగానీ, ధనంగానీ, విలాసవంతమైన జీవితం గానీ అతని ఆత్మహత్యను ఆపలేకపోవడానికి కారణాలేంటి..? మానసిక బలహీనతనే నిరాశ ముందు మనిషి ఓడిపోవడం విషాదకర పరిణామం.

ఆత్మహత్య ఆలోచనలకు మానసిక సమస్యలతోపాటు అనారోగ్యం, ప్రేమ, కుటుంబ, వైవాహిక, ఆర్థిక, మత్తు పదార్థాల వినియోగం, ఒంటరితనం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మన దేశంలో ప్రధానంగా యువతతో పాటు 45 సంవత్సరాలు లోపు ఉన్నవారు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులల్లో పరీక్షల ఆందోళన, ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, రైతులకు వ్యవసాయంలో తగులుతున్న ఎదురు దెబ్బలు, మహిళల్లో గృహహింస ఎక్కువ శాతం బలవన్మరణాలకు కారణమవుతున్నది. 2019 సంవత్సరంలో గత 25 సంవత్సరాల కాలంలో జరగనన్ని ఆత్మహత్యలు విద్యార్థులు విషయంలో జరిగాయి. అత్యధికంగా 10,335 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లమంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. యువత మరణాలకు అత్యధికంగా ఆత్మహత్యలే కారణమని, చనిపోవడానికి ముందు ప్రతి ఒక్కరూ కనీసం 20 సార్లు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని నివేదిక చెబుతుంది. ప్రతి 150 మందిలో ఒకరు వరుసగా స్కిజోఫ్రినియా, బైపోలార్ డిజార్డర్లతో బాధపడుతున్నారు. మానసిక బాధితులకు మెరుగైన చికిత్స, కౌన్సిలింగ్ చేసేందుకు ప్రభుత్వాలు మరింతగా గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, మహిళలకు సహాయం చేయడానికి మానసిక స్థితిలో మెరుగైన మార్పులు చేయడానికి హెల్ఫ్ లైన్‌లు, మనస్తత్వ శాస్త్ర వైద్యులు సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. అన్ని దేశాలు తమ ఆరోగ్య బడ్జెట్‌లో మానసిక ఆరోగ్యం కోసం మరిన్ని నిధులను కేటాయించాలి.

సగటున లక్షమంది మానసిక అనారోగ్య బాధితులకు 13 మంది మాత్రమే వాలంటీర్లు ఉన్నారు. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందని డబ్ల్యుహెచ్‌ఒ సూచిస్తుంది. మానసిక సమస్యలతో ఉన్నవారికి ప్రభుత్వాలు ఇచ్చే చేదోడు కంటే వారివారి కుటుంబాలు, చుట్టుపక్కల ఉన్నసమాజం ఇచ్చే మనోధైర్యం, పెంపొందించే ఆత్మస్థైర్యమే అన్నిటికంటే మనిషి శ్వాసను నిలబెట్టే ఆక్సిజన్. ఆత్మహత్య చేసుకోవాలనే చివరి అంచువరకు వెళ్లిన వారు ఒక్కసారి కుటుంబం, స్నేహితులు, తమను నిలబెట్టగలిగే వైద్యుల చేదోడు కోసం ఒక్క క్షణం ఆలోచన చేస్తే జీవితం ఎంతటి అద్భుతమైన కాలాన్ని పరిచయం చేస్తుందో జోనాథన్ అనే ఒక యువకుడి మాటల్లో.. నేను ఆఫీసుకు తిరిగి కారులో వెళుతుండగా.. నిటారుగా ఉన్న కొండపైకి కారులో వెళ్తుండగా, నేను బ్రేక్ నుండి నా కాలుతీసివేస్తే ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌లోకి దూసుకెళ్లి ఆత్మహత్య చేసుకోగలను అని అనుకున్నా.. పరిస్థితి విషమంగా ఉందని అర్థమైంది. ఒక్క క్షణం ఆలోచించా.. ఆఫీస్‌కు తిరిగి వెళ్లడానికి బదులుగా నేను ఎడమవైపు తిరిగి ఆసుపత్రికి వెళ్లాను. అంతే నా జీవితంలో కోలుకునే ప్రయాణంలో కీలమైన దశలు అద్భుతంగా కొనసాగుతున్నాయి.

అడపా దుర్గ

90007 25566