Reading Time: 2 minutes
Khammam Politics Tummala Vs Puvvada Clash

Off The Record: ఖమ్మం జిల్లాలో ఇద్దరు సీనియర్‌ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం అంతకంతకూ పెరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలం ఖమ్మం నియోజకవర్గాన్ని పట్టించుకోనట్టుగా ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి… తిరిగి యాక్టివ్ అవడంతో… రాజకీయం రంజుగా మారింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరగాల్సిన టైంలో ఈ పోరు పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. అనారోగ్య కారణాలతో కొంత కాలం లోకల్‌ కేడర్‌కు దూరంగా ఉన్నారు పువ్వాడ. కానీ… ఇటీవల తిరిగి యాక్టివ్‌ అయ్యారాయన. ఇందులో భాగంగానే తనకు 60 ఏళ్ళు వచ్చిన సందర్భంగా మమత మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కేడర్‌ని రప్పించారు. దీనికి మాజీ మంత్రి హరీష్‌రావు కూడా అటెండ్‌ అయ్యారు. అక్కడి నుంచి అసలు గేమ్‌ మొదలైంది. హరీష్‌రావును టార్గెట్‌ చేస్తూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు మంత్రి తుమ్మల.

Read Also: Kolukkumalai : భూమిపై మరో స్వర్గం.. కొలుక్కుమలై ‘మేఘాల మంచం’పై ఎప్పుడైనా నిద్రపోయారా.?

అది పుట్టిన రోజో, ఆత్మీయ సమావేశమో, లేక బీఆర్ఎస్ ప్లీనరీనో నాకు తెలియదుగానీ… అంటూనే కార్యక్రమం పెట్టింది కబ్జా స్థలంలో అని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు మంత్రి. కబ్జా స్థలంలోనే సమావేశాన్ని ఏర్పాటుచేశావు హరీష్‌ అంటూ తుమ్మల చేసిన కామెంట్‌తో పువ్వాడ ఫైరైపోయారు. మంత్రిని ఉద్దేశించి అంతే సీరియస్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి. ఇక ఇదే అదనుగా ఇద్దరు నేతల అనుచరులు, అభిమానులు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో యుద్ధం మొదలుపెట్టారు. 2014 నుంచే పువ్వాడ అజయ్, తుమ్మల నాగేశ్వరరావు మధ్య పోరు జరుగుతోంది. అప్పట్లో అజయ్‌ చేతిలో ఓడిపోయారు తుమ్మల. ఆ తర్వాత ఆయన్ని బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్‌. మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దీంతో అప్పట్లో మినిస్టర్‌గా తుమ్మల, ఎమ్మెల్యేగా అజయ్‌ ఒకే పార్టీలో ఉన్నా… ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి. ఇక 2018లో మంత్రి పదవి కోసమే తనను ఓడించారంటూ పువ్వాడ అజయ్ మీద ఆరోపణలు చేశారు తుమ్మల నాదేశ్వరరావు.

ఒక పార్టీలో ఉన్నప్పుడే సఖ్యత కుదరని ఇద్దరు నాయకులు ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్నందున రాజకీయ యుద్ధానికి తెరతీస్తున్నారట. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన తుమ్మల నాగేశ్వరరావు 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఉన్న పువ్వాడను ఓడించారు. ఇక మమత మెడికల్ కళాశాల ఉన్న స్థలం కబ్జా చేసింది, అజయ్‌ అనుచర వర్గం కూడ కబ్జా రాయుళ్లే అంటూ తుమ్మల ఆరోపిస్తుంటారు. అయితే ఆ కబ్జా అని చెబుతున్న స్థలాన్ని రెగ్యులర్ చేసినప్పడు తుమ్మల మంత్రి కాదా అని ప్రశ్నిస్తున్నారు పువ్వాడ. ఇలా నాయకులు ఇద్దరూ చూస్కుందామంటే చూస్కుందాం… రా… అన్నట్టు స్టేట్‌మెంట్స్‌ ఇస్తూ పొలిటికల్‌ హీట్‌ పెంచుతున్నారు.