
ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. 2026 ఏప్రిల్ 24వ తేదీ సాయంత్రం పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో పోలీసులు, ఆర్టీసీ జేఏసీ నేతల సమక్షంలో అంత్యక్రియలు చేశారు.
అంతకు ముందు అంత్యక్రియల విషయంలో కొంత హైడ్రామా చోటుచేసుకుంది. మృతదేహాన్ని నర్సంపేట బస్సు డిపో వద్దకు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు, జేఏసీ నేతలు పట్టుబట్టారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది.
►ALSO READ | ప్రాణాలు తీసుకోవద్దు.. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం లభిస్తది: డిప్యూటీ సీఎం భట్టి
ఆ తర్వాత శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని ఆందోలనకు దిగారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. అంతకు ముందే శంకర్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం, కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసుల మంతనాలు ఫలించడంతో అంతిమయాత్రకు అంగీకరించారు. అంతిమయాత్ర పూర్తైన తర్వాత సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి.