Reading Time: < 1 minute
TG PECET 2026: పీఈటీ అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ రిలీజ్.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..?

తెలంగాణలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ TG PECET – 2026 నోటిఫికేషన్‌ను శాతవాహన విశ్వవిద్యాలయం విడుదల చేసింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

ముఖ్యమైన కోర్సులు – అర్హతలు

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లోని ఈ క్రింది కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

  • B.P.Ed (Bachelor of Physical Education): రెండేళ్ల కాలపరిమితి. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
  • D.P.Ed (Diploma in Physical Education): రెండేళ్ల కాలపరిమితి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అభ్యర్థులు కనీసం 19 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. జాతీయ లేదా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే:

  • అధికారిక నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 25, 2026
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మార్చి 02, 2026 (సోమవారం)
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 05, 2026 (మంగళవార
  • పరీక్షా తేదీలు: మే 31, 2026నుండి జూన్ 03, 2026 వరకు

పరీక్షా విధానం – కేంద్రం

TG PECET అనేది సాధారణ రాత పరీక్ష కాదు. ఇది అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని పరీక్షించే ప్రక్రియ. ఈ ఏడాది ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టులు, స్కిల్ టెస్టులను కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే నిర్వహించనున్నారు.అభ్యర్థులకు 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ వంటి ఈవెంట్లతో పాటు వారు ఎంచుకున్న క్రీడలో నైపుణ్యాన్ని పరిశీలిస్తారు.

దరఖాస్తు ఇలా చేసుకోండి..

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://pecet.tgche.ac.in సందర్శించి మార్చి 2 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన సర్టిఫికెట్లు, క్రీడా ధృవీకరణ పత్రాలను సిద్ధం చేసుకోవాలని కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ సూచించారు. కాగా క్రీడల పట్ల ఆసక్తి ఉండి, పీఈటీలుగా స్థిరపడాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.