Reading Time: 2 minutes

Raja Shivaji First Look: ఛత్రపతి శివాజీగా రితేష్ దేశ్‌ముఖ్.. ‘రాజా శివాజీ’ ఫస్ట్ లుక్ రిలీజ్!

Caption of Image.

మరాఠా  వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బాలీవుడ్ స్టార్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తన డ్రీమ్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేశారు.  తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘రాజా శివాజీ’ (Raja Shivaji) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.  అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించేలా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 

రితేష్ డ్రీమ్ ప్రాజెక్ట్!

ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ స్వయంగా శివాజీ మహారాజ్ పాత్రలో పోషించడమే కాకుండా, దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నారు. తన భార్య, నటి జెనీలియా దేశ్‌ముఖ్ ముంబై ఫిల్మ్ కంపెనీ, జియో స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదని, మరాఠా వీరుడి పోరాట పటిమకు దక్కిన గౌరవమని రితేష్ పేర్కొన్నారు. 

భారీ అంచనాలతో

మహారాష్ట్ర దినోత్సవం (Maharashtra Day) సందర్భంగా 2026 మే 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరాఠీ, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ , మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సందడి చేయబోతోంది. ఈ ప్రాజెక్టును అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు రితేష్ దిగ్గజాలను రంగంలోకి దించారు. ప్రపంచ ప్రఖ్యాత కెమెరామెన్ సంతోష్ శివన్ తన అద్భుత దృశ్యాలతో ఈ చారిత్రక కావ్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.

చిన్న వయసులోనే ‘స్వరాజ్యం’ కోసం కత్తి పట్టిన శివాజీ, మొఘలులు, అదిల్ షాహీలను ఎదుర్కొన్న తీరును ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు.. శివాజీ మహారాజ్ అనుసరించిన గెరిల్లా యుద్ధ తంత్రాలు, ఆయన పరిపాలనా దక్షతను ఈ జనరేషన్ ఆడియన్స్‌కు పరిచయం చేయడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం అని రితేష్ తెలిపారు.శివాజీ శత్రువుల పాత్రలో లేదా కీలకమైన మరాఠా వీరుల పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్ కనిపించనున్నట్లు సమాచారం. ఇది సినిమా స్థాయిని మరింత పెంచుతోంది.

 

©️ VIL Media Pvt Ltd.