Reading Time: 2 minutes

5వేల ఏళ్ల క్రితం నాటి అరుదైన ఆచారాలు : కూతురు ఛాతీపై తండ్రి ఎముకలతో పాతిపెట్టి.. బయటపడ్డా వింత నిజాలు..

Caption of Image.

5,500 సంవత్సరాల క్రితం నాటి ఒక ఆసక్తికరమైన విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. స్వీడన్‌లోని గోట్‌ల్యాండ్ ద్వీపంలో జరిపిన DNA విశ్లేషణలో, ఒక టీనేజ్ అమ్మాయి సమాధిలో ఆమె తండ్రి ఎముకలు కూడా ఉన్నట్లు బయటపడింది. స్వీడన్‌లోని అజ్విడే అనే ప్రాంతంలో 1983లో తవ్వకాలు జరిపినప్పుడు సుమారు 85 సమాధులు బయటపడ్డాయి. ఇవి ‘పిట్టెడ్ వేర్’ (Pitted Ware) అనే సంస్కృతికి చెందిన వేటగాళ్లవి. ఆ కాలంలో యూరప్ అంతా వ్యవసాయం వైపు మళ్లుతున్నా, ఈ సమూహం మాత్రం పాత పద్ధతుల్లోనే సీల్ చేపలను వేటాడుతూ, చేపలు పడుతూ జీవించేవారు.

DNA పరిశోధనలో తేలిన కొత్త నిజాలు
ఉప్ప్సల విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ సమాధుల్లోని అస్థిపంజరాలకు DNA పరీక్షలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఒక టీనేజ్ అమ్మాయిని పాతిపెట్టినప్పుడు, ఆమె ఛాతీపై, పక్కన కొన్ని ఎముకలను ఉంచారు. DNA పరీక్షల్లో ఆ ఎముకలు ఆమె సొంత తండ్రివని తేలింది. అంటే, తండ్రి చనిపోయిన చాలా కాలం తర్వాత ఆయన ఎముకలను తీసి, కూతురు చనిపోయినప్పుడు ఆమెతో కలిపి పాతిపెట్టి ఉండవచ్చు.

 మరో సమాధిలో ఒక స్త్రీ పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాధారణంగా ఆమె వారి తల్లి అని అనుకుంటారు. కానీ DNA ప్రకారం ఆమె వారి తల్లి కాదు, బహుశా వారి అత్త లేదా పిన్ని అయి ఉండవచ్చు. చాలా సమాధుల్లో పక్కపక్కన ఉన్నవారు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు (ఫస్ట్ డిగ్రీ బంధువులు) కాదని, వారు మేనమామ పిల్లలు లేదా దూరపు బంధువులని తెలిసింది.

ఈ పరిశోధన వల్ల ఆ కాలపు మనుషులు అంటే  వేటగాళ్ల సామాజిక జీవితం గురించి కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. వారు కేవలం రక్త సంబంధీకులనే కాకుండా,  దూరపు బంధువులను కూడా సమానంగా గౌరవించేవారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థం లేదా వారిని గౌరవించడానికి ఎముకలను తిరిగి తీసి వేరే సమాధుల్లో ఉంచే ఆచారం ఉండేది. కుటుంబ బంధాలకు వారు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఈ ఉమ్మడి ఖననాలు నిరూపిస్తున్నాయి.

శాస్త్రవేత్తలు త్వరలోనే ఈ స్మశానవాటికలోని మిగిలిన అన్ని అస్థిపంజరాలకు DNA పరీక్షలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల 5 వేల ఏళ్ల క్రితం మనుషులు ఎలా జీవించారు, వారి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదనే మరిన్ని రహస్యాలు బయటపడే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.