Reading Time: 2 minutes
Washington Sundar Injury Worries Bcci Ahead Of India Vs Sri Lanka Test Series 2026

శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం భారత జట్టు సెలెక్షన్ కమిటీని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేకు హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా దూరమైన సుందర్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అందుకే శ్రీలంక టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించడాన్ని బీసీసీఐ సెలెక్టర్లు వాయిదా వేసినట్లు సమాచారం. సుందర్ గాయం తీవ్రతపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే బీసీసీఐ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

వాషింగ్టన్ సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి స్కానింగ్ నిర్వహించనుండగా.. అది గ్రేడ్-1 హ్యామ్‌స్ట్రింగ్ ఇంజరీ అయ్యే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. గాయం తీవ్రతను బట్టి శ్రీలంక టెస్టు సిరీస్‌లో అతని భాగస్వామ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంకలోని కొలంబోకు చేరుకోనుంది. ప్రధాన టెస్టు సిరీస్‌కు ముందు స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఆగస్టు 7 నుంచి 10 వరకు కొలంబోలోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ఆటగాళ్లకు శ్రీలంక పిచ్‌లు, వాతావరణానికి అలవాటు పడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

వార్మప్ మ్యాచ్ అనంతరం భారత జట్టు గాలేకు వెళ్లనుంది. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో నిర్వహించనున్నారు. రెండు టెస్టులు కూడా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పరంగా ఈ సిరీస్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ప్రస్తుతం భారత్ 9 టెస్టుల్లో 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానంలో ఉండగా.. శ్రీలంక 44.44 పాయింట్ల శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఈ సిరీస్‌లో విజయం సాధించిన జట్టుకు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో కీలక ఆధిక్యం లభించే అవకాశం ఉంది. భారత్ చివరిసారిగా 2017లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడి 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనున్న భారత జట్టు.. మరోసారి విజయంతో పర్యటనను ముగించాలని చూస్తోంది.