AI కోర్సులకు భారీ డిమాండ్.. TGEAPCET-2026 రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి..!

తెలంగాణలో TGEAPCET-2026 రెండో విడత ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తైంది. ఈ విడతలో మొత్తం అందుబాటులో ఉన్న 94,424 ఇంజనీరింగ్ సీట్లలో 80,167 సీట్లు కేటాయించగా.. 14,257 సీట్లు ఖాళీగా మిగిలాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 84.9% సీట్లు భర్తీ అయినట్లు అధికారులు వెల్లడించారు.
రెండో విడత కౌన్సెలింగ్‌లో 7,897 మంది విద్యార్థులకు తొలిసారిగా సీట్లు కేటాయించగా.. 34,828 మందికి స్లైడింగ్ ద్వారా కొత్త కళాశాల లేదా కోర్సులో సీట్లు లభించాయి. మరో 37,442 మంది విద్యార్థులకు గతంలో కేటాయించిన సీట్లే కొనసాగాయి. అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోటా కింద 6,329 మంది విద్యార్థులు సీట్లు పొందారు.
ఈ ఏడాది మొత్తం 176 ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు జరిగింది. వీటిలో ఒక ప్రభుత్వ కళాశాల, 21 యూనివర్సిటీలు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీలు, 152 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అత్యధికంగా 99.9% సీట్లు భర్తీ కాగా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 85.5%, యూనివర్సిటీల్లో 75.4%, ప్రభుత్వ కళాశాలల్లో 26.2% సీట్లు మాత్రమే పూర్తయ్యాయి.
కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సులకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 66,482 సీట్లలో 58,364 సీట్లు (88%) భర్తీ అయ్యాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), CSN, RAI కోర్సుల్లో 100% సీట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే CSE విభాగంలో 30,838 సీట్లకు గాను 27,803 సీట్లు (90%), CSMలో 89%, CSDలో 84% సీట్లు కేటాయించబడ్డాయి. వీటితోపాటు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 18,805 సీట్లలో 15,109 సీట్లు (80%) భర్తీ అయ్యాయి. BME, ETM, ECM, EIE, ECV కోర్సుల్లో 100% సీట్లు కేటాయించగా, ECEలో 84% (10,832 సీట్లు), EEEలో 69% (3,464 సీట్లు) భర్తీ అయ్యాయి.
సివిల్, మెకానికల్, అనుబంధ కోర్సుల్లో మొత్తం 7,918 సీట్లలో 5,848 సీట్లు (74%) భర్తీ అయ్యాయి. MET, MMS, MTE, ANE, MCT, AUT, MME కోర్సుల్లో 100% సీట్లు నిండగా.. సివిల్ ఇంజనీరింగ్‌లో 74% (2,853 సీట్లు), మెకానికల్ ఇంజనీరింగ్‌లో 71% (2,518 సీట్లు) సీట్లు కేటాయించబడ్డాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో మొత్తం 1,219 సీట్లలో 846 సీట్లు (69%) భర్తీ అయ్యాయి. CHE, GEO, AGR, FDT, TEX కోర్సుల్లో 100% సీట్లు కేటాయించడం విశేషం.
రెండో విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 25లోగా ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అలాగే జూలై 24 నుంచి 28, 2026 మధ్య కేటాయించిన కళాశాలలో స్వయంగా రిపోర్ట్ చేయాలి. సీటును ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవాలనుకునే వారు జూలై 28లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్యూషన్ ఫీజును విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల సొంత బ్యాంక్ ఖాతాల నుంచే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా చెల్లించాలి. ఒకవేళ ఫీజు రిఫండ్ వర్తిస్తే, అదే బ్యాంక్ ఖాతాకు తిరిగి జమ చేయబడుతుందని స్పష్టం చేశారు.