July 23, 2026

Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్

Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
Reading Time: 2 minutes
Preity Zinta Supports Student Protests Urges Government To Hold Dialogue

Preity Zinta Support Student Protests: బాలీవుడ్ నటి ప్రీతి జింటా విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న విద్యార్థుల నిరసనలపై స్పందించారు. కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆమె విద్యార్థుల డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తూ, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలని కోరారు. అదే సమయంలో శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమాన్ని ఎలాంటి దుష్టశక్తులు లేదా అనుమానాస్పద వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విద్యార్థుల ఉద్యమంపై ప్రీతి జింటా తన సోషల్ మీడియా పోస్టులో స్పందిస్తూ.. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలు, విభజనాత్మక ప్రచారాన్ని చూస్తుంటే దేశంలోపల, విదేశాల్లో ఉన్న కొందరు శక్తులు విద్యార్థుల ఆగ్రహాన్ని తమ అజెండాకు అనుకూలంగా మలచడానికి ప్రయత్నిస్తున్నాయేమోననే ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ఉద్యమం అసలు లక్ష్యం విద్యా వ్యవస్థలో సంస్కరణలు సాధించడమేనని, దానిని అరాచకానికి లేదా రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మార్చకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

తాను ఎప్పుడూ కృషి, సమానత్వం, ప్రతిభను విశ్వసిస్తానని ప్రీతి జింటా తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై, శాంతిభద్రతలపై, ప్రభుత్వంపై తనకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం, విద్యార్థి సంఘాలు పరస్పరం అర్థవంతమైన, సానుకూల చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం కనుగొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ యువత భవిష్యత్తు, ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఈ ఉద్యమానికి ఎలాంటి అనుమానాస్పద అజెండాలను దూరంగా ఉంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా, ప్రీతి జింటా గతంలో కూడా సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై స్పందిస్తూ, ప్రభుత్వం ఆయనతో పాటు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు. అలాగే ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరాహార దీక్షను విరమించాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రీతి జింటా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలనే ఆమె సూచనకు పలువురు మద్దతు వ్యక్తం చేస్తున్నారు.