July 23, 2026

Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు

Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్‌స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
Reading Time: 2 minutes
Meta Faces Lawsuit Over Instagrams Alleged Teen Social Media Addiction Design

Instagram Addiction: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి వివాదంలో చిక్కుకుంది. మెటాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) టీనేజర్లను ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాకు బానిసలుగా మార్చే విధంగా రూపొందించబడిందంటూ అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మెటాతో పాటు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ పై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టెన్నెస్సీ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీచర్లు టీనేజర్లు ఎక్కువసేపు యాప్‌లో గడిపేలా రూపొందించబడ్డాయి. దీని వల్ల యువతలో సోషల్ మీడియా వ్యసనం పెరగడమే కాకుండా, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రతరమవుతున్నాయని ఆరోపించింది. ఈ అంశంపై వచ్చే వారంలో కోర్టులో కీలక విచారణ జరిగే అవకాశం ఉంది..

పిటిషన్‌లో మరో కీలక అంశం కూడా ప్రస్తావించారు. టీనేజర్లపై ఇన్‌స్టాగ్రామ్ ప్రభావం గురించి మెటా సంస్థ అంతర్గతంగా పరిశోధనలు నిర్వహించిందని, ఆ నివేదికల్లో యాప్ వల్ల కలిగే ప్రమాదాలను గుర్తించినప్పటికీ వాటిని బహిరంగంగా వెల్లడించలేదని టెన్నెస్సీ అటార్నీ జనరల్ జోనాథన్ స్క్రమెట్టి కార్యాలయం ఆరోపించింది. అంతేకాదు, ఈ పరిశోధనల వివరాలను పలువురు ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్ దృష్టికి తీసుకెళ్లినా, హానిని తగ్గించే చర్యలకు తగిన నిధులు కేటాయించలేదని కూడా దావాలో పేర్కొన్నారు. అలాగే ప్లాట్‌ఫారమ్‌లోని హానికరమైన కంటెంట్ పరిమాణంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని ఆరోపించారు.

ఈ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆటోప్లే, రీల్స్, నోటిఫికేషన్లు వంటి ఫీచర్లు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఇవి వినియోగదారులు, ముఖ్యంగా టీనేజర్లు, ఎక్కువ సమయం యాప్‌లోనే గడిపేలా ప్రోత్సహిస్తున్నాయని టెన్నెస్సీ ప్రభుత్వం వాదిస్తోంది. అందువల్ల మెటాపై జరిమానా విధించడంతో పాటు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవసరమైన మార్పులు చేయాలని కోర్టును కోరింది. అయితే ఈ ఆరోపణలను మెటా ఖండించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే కంటెంట్‌లో ఎక్కువ భాగం వినియోగదారులే పోస్ట్ చేస్తారని, మూడో వ్యక్తులు పోస్ట్ చేసిన కంటెంట్‌కు సంబంధించి అమెరికా కమ్యూనికేషన్స్ డీసెన్సీ యాక్ట్‌లోని సెక్షన్ 230 ప్రకారం తమకు చట్టపరమైన రక్షణ ఉందని సంస్థ వాదిస్తోంది. ఈ కేసు ఫలితం సోషల్ మీడియా సంస్థలపై భవిష్యత్తులో మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావడానికి దారితీసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టీనేజర్ల ఆన్‌లైన్ భద్రత, మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఈ కేసు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది..