July 23, 2026

IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!

IND vs ZIM: ముగ్గురు ఆటగాళ్లకు గాయాలు.. బరువు పెరిగిన స్టార్ ప్లేయర్.. తీవ్ర ఆందోళనలో బీసీసీఐ!
Reading Time: 2 minutes
Bcci Concerned Over Sanju Samsons Weight Gain Fitness Issues Raise Alarm Ahead Of India Assignments

టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఫిట్‌నెస్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల సంజు బరువు పెరగడం జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోందని సమాచారం. అంతేకాకుండా ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో వైద్య బృందం, ఆటగాళ్ల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్ల ఫిట్‌నెస్ సమస్యలు మరింత పెరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచి భారత్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన సంజు.. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో తేలిపోయాడు. దీంతో జూలై 23 నుంచి ప్రారంభమయ్యే జింబాబ్వే టీ20 సిరీస్‌లో అతడికి బీసీసీఐ విశ్రాంతిని ఇచ్చింది.

భారత జట్టు మేనేజ్‌మెంట్ పలువురు ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తోందని ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ క్రికెటర్లు తరచూ గాయాల కారణంగా ఫిజియోథెరపిస్టుల పర్యవేక్షణలోనే ఉండాల్సి వస్తోంది. అదే సమయంలో సంజు శాంసన్ బరువు పెరగడం కూడా ఆందోళనకర అంశంగా మారిందని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. ‘సుందర్‌కు ఎప్పటినుంచో ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు సంజు కూడా బరువు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆటగాళ్లు జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మెడికల్ టీమ్‌తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఫిట్‌నెస్ సమస్యల ప్రభావం జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలపై కూడా పడుతోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారట.

2026 ఐపీఎల్ సమయంలో రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ గాయాన్ని ముంబై ఇండియన్స్ వైద్య బృందం దాదాపు నెల రోజుల పాటు గుర్తించలేకపోయిందని, చివరకు హిట్‌మ్యాన్ స్వయంగా బీసీసీఐ మెడికల్ డేటా బేస్‌ను పరిశీలించి తన గాయం గురించి తెలుసుకున్నాడట. ప్రస్తుతం చాలా మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడడం లేదు. అంతర్జాతీయ సిరీస్‌ల మధ్య వారికి తగిన విరామం లభిస్తున్నా.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్‌లో లేకపోతే వారు వ్యక్తిగతంగా శిక్షణ పొందుతున్నారు. ఈ సమయంలో జాతీయ మెడికల్ టీమ్‌తో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం సమస్యగా మారిందట. ఆటగాళ్లకు మరింత దగ్గరగా ఉండే, సహాయకరమైన వైద్య వ్యవస్థ అవసరమని.. ప్రస్తుతం చాలా మంది సీనియర్ క్రికెటర్లు సీఓఈ సేవలను వినియోగించకుండా వ్యక్తిగతంగా శిక్షణ తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారని సదరు నివేదిక వెల్లడించింది.

2026 టీ20 ప్రపంచ కప్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేశాడు. 80.25 సగటు, 199.37 స్ట్రైక్‌రేట్‌తో మూడు వరుస మ్యాచ్‌ల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ఆ ఫామ్‌ను తర్వాత కొనసాగించలేకపోయాడు. ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0, 5 పరుగులకే పరిమితమైన సంజు.. ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా తొలి మ్యాచులో ఒకే పరుగు చేసి జట్టులో స్థానం కోల్పోయాడు. చివరి టీ20లో తిరిగి అవకాశం దక్కగా.. 14 బంతుల్లో 27 పరుగులు చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో జింబాబ్వే పర్యటనలో అతడికి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.