July 23, 2026

Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!

Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుపై వైభవ్ సూర్యవంశీ కన్ను.. ఇంకెవ్వరూ బ్రేక్ చేయలేరేమో!
Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Eyes Youngest T20i Century World Record Against Zimbabwe

Vaibhav Sooryavanshi Eyes Youngest T20I Century: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేక విమర్శలు ఎదుర్కొన్న ఈ 15 ఏళ్ల కుర్రాడు.. ఇప్పుడు జింబాబ్వేతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారీగా రన్స్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈరోజు హరారే వేదికగా జరిగే తొలి టీ20తోనే భారీ ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్న వైభవ్.. ఈ సిరీస్‌లో పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.

హరారేలో అద్భుతమైన ట్రాక్ రికార్డు:

హరారే మైదానం వైభవ్ సూర్యవంశీకి ఎంతో ప్రత్యేకమైనది. ఇదే వేదికపై ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు బాది భారత్‌కు ప్రపంచ కప్‌ను అందించాడు. జింబాబ్వేలో జరిగిన ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 62.71 సగటు, 169.49 స్ట్రైక్‌రేట్‌తో 439 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే మైదానంలో భారత సీనియర్ జట్టుతో ఆడే అవకాశం రావడంతో.. మరోసారి భారీ ఇన్నింగ్స్‌పై బుడ్డోడు కన్నేశాడు.
సెంచరీ బాదితే ప్రపంచ రికార్డు ఖాయం

శతకం చేస్తే:

జింబాబ్వే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ శతకం చేస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మెకియాన్ పేరిట ఉంది. 18 సంవత్సరాల 280 రోజుల వయసులో అతడు సెంచరీ బాదాడు. కేవలం 15 ఏళ్ల వయసులో ఉన్న వైభవ్ సెంచరీ సాధిస్తే.. ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోనుంది. ఒకవేళ బుడ్డోడు సెంచరీ చేస్తే.. ఆ రికార్డును మరొకరు బ్రేక్ చేయడం అసాధ్యమే. 15 ఏళ్లకే టీమిండియాలో రావడం అసాధ్యం.. అందులోనూ శతకం బాదడం అస్సలు అయ్యే పనికాదు.

సిక్సర్లతో రికార్డులపై గురి:

మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడే వైభవ్ సూర్యవంశీ శైలి ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఐపీఎల్ 2026లో జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లపైనా ఎలాంటి బెరుకు లేకుండా ఎదురుదాడి చేసి తన పవర్ హిట్టింగ్‌ను చాటుకున్నాడు. టీనేజ్ క్రికెటర్లలో పురుషుల టీ20 క్రికెట్‌లో అతడి కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన ఆటగాడు ఇప్పటివరకు లేడు. ఇదే జోరును జింబాబ్వే సిరీస్‌లో కొనసాగిస్తే.. ఒకే టీ20 సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీనేజ్ బ్యాటర్‌గా మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది.

రోహిత్, రాహుల్ రికార్డులకు ముప్పు:

భారత్ తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు ప్రస్తుతం రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేరిట ఉంది. వీరిద్దరూ 14 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశారు. అయితే వైభవ్ దూకుడైన బ్యాటింగ్‌ను చూస్తే.. ఈ రికార్డుత్వరలో బ్రేక్ అవనుంది. ఇప్పటికే లిస్ట్-ఏ క్రికెట్‌లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఘనత వైభవ్ పేరిట ఉంది. పవర్‌ప్లేలో అతడు చెలరేగితే రోహిత్, రాహుల్ రికార్డులు కూడా తుడిచిపెట్టుకుపోయాయి.