Reading Time: < 1 minute
Tamil Nadu Cm Vijay Pm Modi Congratulates Tvk Government 2026

PM Modi Congratulates Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్‌ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. సీఎంకు కీలక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. “తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరు సి. జోసెఫ్ విజయ్‌కు అభినందనలు. మీ పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్రం ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది” అని ప్రధాని మోడీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా.. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం అత్యంత వైభవంగా జరిగిన వేడుకలో టీవీకే (TVK) అధినేత విజయ్‌తో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. విజయ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలో మరో తొమ్మిది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగోట్టయన్, కేజీ అరుణ్ రాజ్, పి. వెంకటరమణన్, ఆర్. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభు, ఎస్. కీర్తనలు విజయ్ కేబినెట్‌లో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ వేడుకకు ముందు విజయ్ గవర్నర్‌కు ఘన స్వాగతం పలికి, తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు.

ఇక, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయి. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 234 స్థానాలకు గాను 108 సీట్లను గెలుచుకుని సంచలనం సృష్టించింది. 1960ల తర్వాత రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు (DMK, AIADMK) ఒకేసారి అధికారాన్ని కోల్పోవడం ఇదే ప్రథమం. టీవీకేకు సొంతంగా పూర్తి మెజారిటీ రానప్పటికీ.. గతంలో డిఎంకె కూటమిలో ఉన్న కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, వీసీకే మరియు ఐయూఎంఎల్ పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటైంది. అభిమానులచే ‘దళపతి’గా పిలవబడే విజయ్, ఎన్నికల ప్రచారంలో భారీ జనసందోహాన్ని ఆకర్షించారు. ఆయన రాజకీయ ఎదుగుదలను చూస్తుంటే అలనాటి దిగ్గజం ఎంజీ రామచంద్రన్ (MGR) గుర్తుకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.