
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు భారీ ఊరట లభించింది. 2026 మే 1న యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భుయాన్ శర్మ వేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఆయనకు బెయిల్ లభించింది.
పవన్ ఖేరాతో పాటు ఫిర్యాదు దారు వాదోపవాదాలు విన్న కోర్టు.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది. జస్టిస్ట్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందూర్కర్ లతో కూడిన ధర్మాసనం.. ఆర్టికల్ 21 ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛను ప్రమాదంలో పడేయలేమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
ఈ కేసులో ఒకవేళ ఖేరాను అరెస్టు చేస్తే.. కండిషన్స్ తో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. కేసుకు సంబంధించిన విచారణకు సహకరించాలని ఖేరాకు సూచించింది. అనుమతి లేకుండా దేశాన్ని విడిచి వెళ్లరాదని సూచించింది.
ఏంటి వివాదం..?
అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ భార్య రిణికి భూయాన్‌కు మూడు పాస్ట్ పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు అస్సాం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రిణికి భూయాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు గౌహతి పోలీసులు పవన్ ఖేరాపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కేసు నమోదైన అస్సాంలో సంబంధిత కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు వారం రోజులపాటు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును అస్సాం పోలీసులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు.