Reading Time: < 1 minute
Perfect Roti Dough Ratio How To Mix Wheat Flour And Water For Soft Rotis

Perfect Roti Dough Ratio: మన దేశంలో మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి రొట్టె (చపాతీ) ప్రధాన ఆహారంగా ఉంటుంది. మరికొందరైతే ఉదయం కూడా జొన్న రొట్టె, చపాతీ చేసుకునేవారు కూడా లేకపోలేదు.. అయితే చాలా మందికి రొట్టె పిండిని ఎలా సరిగ్గా కలపాలో, ఎంత నీరు కలపాలో తెలియదు. పిండిని సరైన విధంగా కలపకపోతే రొట్టెలు గట్టిగా మారడం, చల్లారిన తర్వాత పాపడ్‌లా మారడం లేదా ఒత్తేటప్పుడు పిండికి అంటుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే పిండిని కలిపేటప్పుడు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

పిండి – నీటి సరైన నిష్పత్తి
వంట నిపుణుల ప్రకారం మంచి పిండి ముద్ద రావాలంటే పిండి నాణ్యతకు అనుగుణంగా నీటిని కలపాలి. సాధారణంగా 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు కంటే కొద్దిగా తక్కువ నీరు సరిపోతుంది. అంటే పిండి – నీటి నిష్పత్తి సుమారుగా 2:1గా ఉండాలి. అయితే ముతకగా ఉన్న పిండి ఎక్కువ నీటిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైతే కొంచెం ఎక్కువ నీరు కూడా కలపాలి.

గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది
రొట్టెలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలంటే పిండిని కలపడానికి సాధారణ నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. గోరువెచ్చని నీరు పిండిలోని ప్రోటీన్లను ఉత్తేజితం చేసి పిండికి సాగే గుణాన్ని ఇస్తుంది. దీంతో రొట్టెలు మృదువుగా తయారవుతాయి. ప్రత్యేకంగా చలికాలంలో గోరువెచ్చని నీటితో పిండిని కలపడం చాలా మంచిది. ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం పాలతో పిండిని కలిపితే రొట్టెలు మరింత మృదువుగా, రుచిగా తయారవుతాయి.

పిండిని కొద్దిసేపు ఉంచాలి
చాలా మంది పిండిని కలిపిన వెంటనే రొట్టెలు చేయడం ప్రారంభిస్తారు. కానీ, మంచి రొట్టెలు రావాలంటే పిండిని కలిపిన తర్వాత మూతపెట్టి 15–20 నిమిషాలు ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత పిండితో రొట్టెలు చేస్తే అవి మెత్తగా, రుచిగా తయారవుతాయి.